రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణకి జీవిత ఖైదు విధించారు. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేశాడు పూజారి సాయి. శంషాబాద్ లో అప్సరను చంపి కారులో తీసుకువచ్చి వాటర్ ట్యాంకులో పూడ్చిపెట్టాడు. నాలుగేళ్ల పాటు అప్సరతో ప్రేమ కార్యకలాపాలు జరిపాడు. పెళ్లి చేసుకోమని వెంటపడడంతో అప్సరను కిరాతకంగా చంపి పూడ్చి పెట్టాడు. ఈ ఘటనలో తాజాగా పూజారి సాయికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడు సంవత్సరాలు అదనపు జైలు శిక్ష విధించింది. 10 లక్షల రూపాయలని అప్సర కుటుంబానికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
READ MORE: Sugar Levels: జొన్న రొట్టెలు తింటే డయాబెటిస్ తగ్గుతుందా?
ప్రేయసి అప్సరను చంపిన పూజారి వెంకట సాయి కృష్ణ కేసులో శిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవికుమార్ వాదనలు వినిపించారు. “ఈ కేసులో మొత్తం 30 మంది సాక్షులను కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. అందులో 28 మంది సాక్షులను పరిగణలోనికి తీసుకుంది కోర్టు. వెంకట సాయి కృష్ణ అప్సరను హత్య చేశాడు అనడానికి అవసరమైన టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు మిగతా ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. వాటిని కోర్టు పరిగణలోకి తీసుకుంది. వెంకట సాయి కృష్ణ వినిపించిన వాదనలను కోర్టు పరిగణలోనికి తీసుకోలేదు. దేవాలయం పూజ కోసం వచ్చిన ఆప్సరను ఏ విధంగా ట్రాప్ చేశాడు? ఏ విధంగా ఆమెను కాశీకి తీసుకొని వెళ్తానని చెప్పి హత్య చేశాడు? పూర్తి ఆధారాలను కోర్టు ముందు ఉంచాం. వెంకట సాయి కృష్ణకి అప్సర సత్యం కేసులో జీవిత ఖైదు తో పాటు సాక్ష్యాధారాలను తారుమారు చేసినందుకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటుగా అప్సర కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెల్లించాలంటూ కూడా ఆదేశాలలో పేర్కొంది.” అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవికుమార్ వెల్లడించారు.