కువైట్ తన దేశ అత్యున్నత గౌరవంతో ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించింది. కువైట్ ఎమిర్ షేక్ మషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ కువైట్ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్’ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అందించారు. కువైట్-భారతదేశం మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి ఈ గౌరవం లభించింది. 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని కువైట్‌ను సందర్శించిన సందర్భంగా ఆయనకు ఈ గౌరవం దక్కింది.
ఇదిలా ఉండగా.. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ శనివారం కువైట్ చేరుకున్నారు. 43 ఏళ్లలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. “మేక్ ఇన్ ఇండియా” ఉత్పత్తులు కువైట్‌లో ముఖ్యంగా ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, మెకానికల్ మెషినరీ, టెలికమ్యూనికేషన్ రంగాలలో కొత్త ప్రవేశాలు చేస్తున్నందుకు తాము సంతోషిస్తున్నట్లు మోడీ తెలిపారు. భారతదేశం నేడు ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అత్యంత తక్కువ ఖర్చుతో తయారు చేస్తోందని తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడానికి చమురుయేతర వాణిజ్యాన్ని వైవిధ్యపరచడం కీలకమని చెప్పారు. ఫార్మాస్యూటికల్, హెల్త్, టెక్నాలజీ, డిజిటల్, ఇన్నోవేషన్, టెక్స్‌టైల్ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు గొప్ప అవకాశం ఉందన్నారు. ఇరువైపులా ఉన్న వ్యాపార వర్గాలు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు పరస్పరం చర్చించుకోవాలని ఆయన కోరారు.