రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలకు సమయం రానే వచ్చింది. నేడు ఉదయం 8 గంటలకు మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే.. ఇప్పటికే 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగగా.. 2,3,4 రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యం కనబరిచారు. అయితే.. ఈ ఎన్నికల్లో మిత్రపక్షమైన సీపీఐ, సీపీఎం పార్టీలు టీఆర్‌ఎస్‌కే మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలో తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉందన్నారు.
Also Read :
Munugode By Election Results: K.A.పాల్ కు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా !
మోదీని ఎదుర్కొనే శక్తి కేసీఆర్‌కే ఉందని సాంబశివరావు.. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు దిశగా ముందుకెళ్లడం సంతోషంగా ఉందన్నారు. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీని కేసీఆర్ ధైర్యంగా ఎదుర్కోగలుగుతారనే విశ్వాసం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని సాంబశివరావు మండిపడ్డారు. బీజేపీని ఓడించాలనే కృతనిశ్చయంతో టీఆర్ఎస్‌కు మద్దతిచ్చామని సాంబశివరావు స్పష్టం చేశారు.
Also Read : Raghunandan Rao: కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు
బీజేపీ నాయకులు మునుగోడును ఒక ప్రయోగశాలగా చేయాలనుకున్నారని సాంబశివరావు మండిపడ్డారు. మునుగోడులో వాస్తవానికి బీజేపీకి బలం లేదని తెలిపిన సాంబశివరావు.. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు 18 నుంచి 20 వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఈ ఎనిమిది ఏండ్ల కాలంలో బీజేపీ చేసిందేమీ లేదని, కేసీఆర్ నాయకత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారన్న సాంబశివరావు.. తెలంగాణలో ప్రజలు స్వయం ఉపాధితో బతుకుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ చొరవతోనే నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారమైందని, కృష్ణా నది కేటాయింపుల్లో కేంద్రం అలసత్వం ప్రదర్శించడం సరికాదన్నారు సాంబశివరావు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలో 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. 2,3,4 రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో టీఆర్‌ఎస్ ఆధిక్యం ప్రదర్శిచింది. ఇంకా 5 రౌండ్లు మాత్రమే కౌంటింగ్ మిగిలి ఉండగా.. దాదాపు టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయమైనట్లు తెలుస్తోంది.