కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు దాడికి మరో రైతు బలైపోయాడు. పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోచయ్య అనే రైతు వ్యవసాయ పనుల కోసం పంట పొలంలోని కరెంటు మోటార్ వేయడానికి ఇవాళ (గురువారం) ఉదయం వెళ్లే క్రమంలో ఏనుగు ఒక్క సారిగా దాడి చేయడంతో.. పోచయ్య అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, నిన్న ( బుధవారం ) చింతల మానేపల్లి మండలం బోరేపల్లి గ్రామంలో శంకర్ అనే రైతుపై దాడి చేసి అక్కడికక్కడే చంపి వేసిన ఘటన మరిచిపోక ముందే.. నేటి ఉదయం కారు పోచయ్యపై దాడి చేసి చంపేయడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు దాడికి ఇద్దరు మృతి మరణించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కోరారు.
ఇక, చింతలమానేపల్లి, పెంచికల్ పేట్, బెజ్జూర్ మండలాల్లో ఫారెస్ట్ అధికారులు డప్పు చాటింపు వేయిస్తున్నారు. పోలాల వైపు ఎవరు కూడా వెళ్లొద్దని పిలుపునిచ్చారు. ఏనుగు సంచారం నేపథ్యంలో అలెర్ట్ అయ్యారు. నిన్న టి నుంచి జిల్లాలో ఏనుగు సంచరిస్తుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మహారాష్ర్ట వైపు నుంచి వచ్చిన ఏనుగు.. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరి ప్రాణాలు తీసింది అని అటవి శాఖ అధికారులు వెల్లడించారు.