Kumari Aunty Food Business Closed: ‘కుమారి ఆంటీ’.. ఈ పేరు ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ‘మీది రూ.1000 అయ్యింది.. రెండు లివర్‌లు ఎక్స్‌ట్రా’ అనే వీడియోతో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో కుమారి ఆంటీ పేరు మార్మోగిపోయింది. దాంతో హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి దగ్గర స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న కుమారి ఆంటీ బిజినెస్ మరింత ఊపందుకుంది. యువతతో పాటు సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నెట్టింట ప్రచారం సాగింది.
బిగ్‌బాస్ రాబోయే సీజన్‌లో కుమారి ఆంటీని తీసుకెళ్లాలని కొందరు డిమాండ్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు ఫుల్ పాపులారిటీ ఉంది. ఈ పాపులారిటీనే కుమారీ ఆంటీని కష్టాల్లోకి నెట్టింది. కుమారి ఆంటీ వద్ద భోజనం చేసేందుకు జనాలు ఎగబడడంతో.. రద్దీ భారీగా పెరిగిపోయింది. భోజనం చేసేందుకు వచ్చిన వారు రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళా కారు దిగి అసహనం వ్యక్తం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. వరుసగా రెండోరోజు పెరిగిన పసిడి ధరలు!
భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా కుమారి ఆంటీపై హైదరాబద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని హెచ్చరించారు. దీంతో కుమారి ఆంటీ, ట్రాఫిక్ పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేశారు. దాంతో కుమారీ ఆంటీ ఎమోషనల్ అయ్యారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ‘మీడియా ద్వారానే నాకు పేరొచ్చింది. ఇప్పుడు కూడా మీడియానే నాకు సాయం చేయాలి. వాహనాలు పక్కన పెట్టాలని, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించొద్దని నా కస్టమర్లకు చెబుతున్నాను. ఇక్కడ చాలామంది ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. అయితే పోలీసులు నా స్టాల్‌ను మాత్రమే క్లోజ్ చేయాలని చెబుతున్నారు. నాకు న్యాయం చేయండి’ అని అన్నారు.