NTV Telugu Site icon

KTR: శాసన సభ నడిచినన్ని రోజులు లగచర్ల ఘటనపై కొట్లాడుతాం..

Ktr

Ktr

KTR: తమ భూమి తమకే ఉండాలని కొట్లాడిన పాపానికి లగచర్ల రైతులను జైల్లో పెట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారన్నారు. లగచర్ల ఘటనపై చర్చ పెడదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్‌ సవాల్ విసిరారు. పురుషులను జైల్లో పెట్టి.. ఆడవారిని ఇంటికి వెళ్లి బెదిరిస్తున్నారన్నారు. కొడంగల్ ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పే వరకు పోరాటం చేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. శాసన సభ నడిచినన్ని రోజులు లగచర్ల ఘటనపై కొట్లాడుతామన్నారు.

Read Also: TG Assembly: లగచర్ల రైతులకు బేడీల విషయంలో బీఆర్‌ఎస్ నిరసన.. అసెంబ్లీ రేపటికి వాయిదా

దుర్మార్గమైన, నికృష్టమైన పాలనను ప్రజలు గమనిస్తున్నారని.. తమ భూమి తమకు కావాలని అడ్డు పడితే రైతులను లాఠీలతో కొట్టారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతుల మీద చర్చ పెడదాం అంటే.. పర్యాటక శాఖ మీద చర్చ పెట్టారన్నారు. మీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రెండే పర్యాటకాలు అని.. ఒకటి ఢిల్లీకి ఎక్కే పర్యాటకం, రెండూ దిగే పర్యాటకం అంటూ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి, మంత్రులు 70 సార్లు ఢిల్లీకి పోయారన్నారు. కొడంగల్ రైతుల మీద చర్చ పెడదాం అంటే అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ కేసీఆర్ పోరాటం చేస్తారని కేటీఆర్ చెప్పారు. పరారీలో ఉన్న వారిని ఇంకా వేధిస్తున్నారని ఆయన అన్నారు. 14 వేల ఎకరాలు గత ప్రభుత్వం సేకరిస్తే రైతులకు భూములు తిరిగి ఇస్తాం అన్నది మీరు అంటూ.. రైతులకు న్యాయం చేసి ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. లగచర్ల రైతులు 40 రోజులుగా జైల్లో ఉన్నారన్నారు. రైతు వీర్య నాయక్‌కు గుండె పోటు వస్తే బేడీలు వేసి ట్రీట్మెంట్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వమంటూ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.