తమ భూమి తమకే ఉండాలని కొట్లాడిన పాపానికి లగచర్ల రైతులను జైల్లో పెట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారన్నారు. లగచర్ల ఘటనపై చర్చ పెడదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
లగచర్ల రైతులకు బేడీల విషయంపై అసెంబ్లీ చర్చకు బీఆర్‌ఎస్ పట్టుబట్టింది. పర్యాటక శాఖపై కాకుండా లగచర్ల రైతులకు బేడీల విషయంపై చర్చ చేపట్టాలని బీఆర్‌ఎస్ శాసనసభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్లకార్డులు పట్టుకొని బీఆర్ఎస్ శాసన సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఇదేం రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.