KTR: తెలంగాణ భవన్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ వ్యక్తిత్వం, నాయకత్వం, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్రను కొనియాడారు. అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ తీసుకున్న కీలక నిర్ణయాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేటీఆర్ తెలిపారు. ఆయన ఆలోచన నాయకత్వం వల్లే మనకు ఈరోజు తెలంగాణ లభించింది. అంబేద్కర్ కారణంగానే మనకు అత్యుత్తమ రాజ్యాంగం లభించిందని అన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతో ముందుచూపుతో కూడినవని, అందుకే ఈ దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా నిలిచిందని పేర్కొన్నారు.
Also Read: Telangana SC Classification: ఎస్సీ వర్గీకరణ అమలు.. తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ..
ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ఇటీవల తమిళనాడులో గవర్నర్ వ్యవహారంపై ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన కేటీఆర్, సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.. రాజ్యసభ, లోకసభ, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ అమలు చేయాల్సిందేనని తీర్పు వెలువడిందని వివరించారు. అలాగే, ఇదే పరిస్థితి తెలంగాణలోనూ ఉందని, మన దగ్గర కూడా గవర్నర్ బిల్లులను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైన మోడీ దగ్గర నుండి క్లియరెన్స్ రాలేదని బిల్లులను ఆపేయడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఈ విషయంలో కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు.