NTV Telugu Site icon

KTR : కాంగ్రెస్-బీజేపీ మధ్య చీకటి ఒప్పందం.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

Ktr

Ktr

KTR : బీజేపీ, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని మరోసారి తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) తన పార్టీ నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రహస్య సమావేశం నిర్వహించారని గతంలో మండిపడ్డ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలపై అధికారికంగా సమీక్షలు నిర్వహించాలి కానీ, రహస్యంగా బీజేపీ నేతలతో సమావేశాలు పెట్టడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాజకీయ చరిత్రలో ఇంత చిల్లర రాజకీయం ఇప్పటి వరకు చూడలేదని విమర్శించిన కేటీఆర్, ఒకవైపు బహిరంగంగా బీజేపీని ఎదుర్కొంటున్నట్టు నటిస్తూ, మరోవైపు దొంగచాటుగా ఒప్పందాలు చేసుకోవడం అనైతికమని ఆరోపించారు. బీజేపీతో సమావేశాలు పెట్టిన ముఖ్యమంత్రి, దానికి సంబంధించి నిజాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు.

“రైతులు పంటలు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గురుకులాల్లో విద్యార్థులు అనారోగ్యంతో మరణిస్తున్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డికి ఈ సమస్యలపై సమీక్షలు నిర్వహించే తీరిక లేకుండా, రహస్య రాజకీయ ఒప్పందాలకే సమయం దొరకడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం,” అని కేటీఆర్ మండిపడ్డారు.

రాహుల్ గాంధీ (Rahul Gandhi) కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు ఉన్నారని అంటుంటే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయటపడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం దీనిపై స్పందించి రేవంత్‌పై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.

“ప్రజలకు సమాధానం చెప్పలేక, బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకుంటూ, రాజకీయ సమీకరణాలు మార్చుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఈ చీకటి రాజకీయాలను సహించబోరు. రాష్ట్రాన్ని వృద్ధిలో నిలిపి, గందరగోళం సృష్టించే ఈ రాబందు రాజకీయాలకు త్వరలోనే సమాధానం చెబుతారు,” అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Crime: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్‌మెయిల్..