గతంలో హైదరాబాద్ వంటకాలు అంటేనే లొట్టలేసుకుని తిన్న జనాలు.. ఇప్పుడు మాత్రం జడుసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా వరుసగా జరుగుతున్న సంఘటనలే ఇందుకు కారణం. నగరంలో నిత్యం ఎదో చోట హోటల్ లేదా రెస్టారెంట్లలో బిర్యానీలో బొద్దింక, సాంబార్లో బల్లి, చట్నీలో ఈగ పడిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. హోటల్/రెస్టారెంట్ యాజమాన్యాలు మాత్రం మారడం లేదు. తాజాగా ఫేమస్ రెస్టారెంట్ కృతుంగలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
Also Read: Jubilee Hills ByPoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఎప్పుడంటే?
నానక్ రామ్ గూడాలోని కృతుంగ రెస్టారెంట్‌కు ఈరోజు ఓ కస్టమర్ తినడానికి వెళ్ళాడు అతడు రాగి సంకటి ఆర్డర్ చేశాడు. రాగి సంకటి సగం తిన్న తర్వాత అతడికి బొద్దింక కనిపించింది. దాంతో ఆ కస్టమర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. రాగి సంకటిలో బొద్దింక రావడంపై హోటల్ సిబ్బందిని అతడు ప్రశ్నించాడు. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. కృతుంగలో అత్యంత దారుణంగా కిచెన్ పరిసరాలు ఉండడాన్ని గమనించాడు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్ నుంచి దుర్వాసన కూడా రావడంతో సదరు కస్టమర్‌కు చిర్రెత్తుకొచ్చింది. సిబ్బంది నిర్లక్ష్యం, కిచెన్ పరిసరాలపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాగి సంకటిలో బొద్దింక ఉన్న ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెగ్యులర్‌గా కృతుంగ రెస్టారెంట్‌కు వెళ్లే కస్టమర్స్ విషయం తెలిసి షాక్ అవుతున్నారు.