టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శల వర్షం కురిపించారు. గిల్ ఓవర్ రేటెడ్ క్రికెటర్ అని పేర్కొన్నారు. గిల్‌కు ఇన్ని అవకాశాలు లభిస్తున్నప్పుడు.. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లకు టెస్టుల్లో ఎక్కువ ఛాన్స్‌లు ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. జాతీయ జట్టుకు ఆడే అర్హత ఉన్న ఆటగాళ్లను బీసీసీఐ సెలక్టర్లు విస్మరిస్తున్నారని శ్రీకాంత్ ఫైర్ అయ్యారు. యువ ప్లేయర్లను సెలక్టర్లు ప్రోత్సహించాలని సూచించారు.
ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత్ 1-3తో ఓడిన విషయం తెలిసిందే. వరుస ఓటములతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి టీమిండియా నిష్క్రమించింది. భారత ఆటగాళ్లలో జస్ప్రీత్ బుమ్రా (31 వికెట్స్) మాత్రమే రాణించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు దారుణంగా విఫలమయ్యారు. శుభ్‌మన్ గిల్ 5 ఇన్నింగ్స్‌ల్లో 93 రన్స్ మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డారు. అదే సమయంలో బీసీసీఐ సెలక్టర్లకు సైతం చురకలు అంటించారు.
Also Read: iPhone 15 Price Drop: 25 వేలకే ‘ఐఫోన్ 15’.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్ ఇవే!
కృష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘శుభ్‌మన్ గిల్ ఓవర్ రేటెడ్ క్రికెటర్. ఈ విషయాన్ని నేను ప్రతిసారీ చెబుతూనే ఉన్నా.. ఎవరూ నా మాట వినలేదు. గిల్‌కు ఇన్ని అవకాశాలు ఇస్తునపుడు సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లకు టెస్టుల్లో ఎక్కువ ఛాన్స్‌లు ఎందుకు ఇవ్వడం లేదు. ఇది కొందరిని ఆశ్చర్యానికి గురిచేయొచ్చు. సూర్యకు టెస్టుల్లో శుభారంభం లేదు కానీ.. అతను టెక్నిక్ బాగుంటుంది, మంచి ప్లేయర్. మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు మాత్రం వైట్‌బాల్ స్పెషలిస్టు అనే ముద్ర వేశారు. సెలెక్టర్లు ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లపై దృష్టి సారించాలి. రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ అతడికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం లేదు. సాయి సుదర్శన్ లాంటి యువ ప్లేయర్లను ప్రోత్సహించాలి. టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు బదులుగా గిల్‌కే ఎక్కువ అవకాశాలిస్తున్నారు’ అని మండిపడ్డారు.