భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ 2025ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించిన టీమిండియా.. ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చుకుంది. కప్ గెలిచి వారం అవుతున్నా.. సంబరాలు మాత్రం ఇంకా ఆగలేదు. క్రికెటర్ల సొంత రాష్ట్రాలు ఘనంగా సత్కరిస్తూ.. రివార్డులు, అవార్డులు ప్రకటిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్లేయర్ క్రాంతి గౌడ్‌ను సత్కరించింది. అంతేకాదు క్రాంతి కోరిక మేరకు బర్తరఫ్ అయిన ఆమె తండ్రిని తిరిగి పోలీసుగా పునర్నియమిస్తామని మోహన్ యాదవ్ హామీ ఇచ్చారు.
2012లో ఎన్నికల విధుల సమయంలో క్రాంతి గౌడ్ తండ్రి మున్నా సింగ్ గౌడ్ ఓ పొరపాటు చేశారు. దాంతో కానిస్టేబుల్ అయిన ఆయనపై వేటు పడింది. అప్పటి నుంచి క్రాంతి కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది. కొన్నిసార్లు తిండికి కూడా సరిగా ఉండేది కాదని గతంలో క్రాంతి చెప్పారు. తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కూడా క్రికెటర్‌గా కెరీర్‌ను కొనసాగించిన క్రాంతి.. భారత జాతీయ జట్టులో చోటు సంపాదించింది. దాంతో ఆమె కుటుంబం ఇబ్బందుల నుంచి బయటపడింది. ఇప్పుడు ఏకంగా వన్డే ప్రపంచకప్ గెలిచి కుటుంబానికి గౌరవాన్ని తెచ్చారు.
తన తండ్రిని తిరిగి పోలీసుగా చూసుకోవాలనుకుంటున్నట్లు, గౌరవంగా రిటైర్ కావాలని కోరుకుంటున్నట్లు క్రాంతి గౌడ్ ఇటీవల చెప్పారు. చరిత్రాత్మక ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన క్రాంతిని ఆమె తల్లిదండ్రుల ఎదురుగా సీఎం మోహన్ యాదవ్ సన్మానించారు. క్రాంతి కోరిక తెలుసుకున్న సీఎం.. మున్నా సింగ్‌ను తిరిగి పోలీసు శాఖలో తీసుకుంటామని చెప్పారు. సీఎం హామీ ఇవ్వడంతో తనకు చాలా ఆనందంగా ఉందని క్రాంతి తెలిపారు. కొలంబోలో పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి భారత జట్టు 88 పరుగుల తేడాతో గెలిపించడంలో క్రాంతి సహాయపడ్డారు. ఆమెకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.