రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ జర్నలిస్టు, సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు నేడు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. కోర్టుకు సెలవులు కావడంతో గుంటూరు జిల్లా జైలులోనే కొమ్మినేని ఉన్నారు. నేడు మంగళగిరి కోర్టులో షూరిటీలు సమర్పించిన తర్వాత గుంటూరు జైలు నుంచి కొమ్మినేని విడుదల కానున్నారు.
సాక్షి చానెల్ డిబేట్‌లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొమ్మినేని శ్రీనివాసరావుపై జూన్ 9న తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జూన్ 10న మంగళగిరి కోర్టులో కొమ్మినేనిని హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దాంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. దీనిపై కొమ్మినేని హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో విచారణలో ఉన్న సమయంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. జూన్ 13న బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు శుక్రవారం జైలు అధికారులకు అందలేదు. శని, ఆదివారాలు సెలవు కావడంతో.. నేడు కొమ్మినేని విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.