చెరువుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వాహణపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రివ్యూ చేశారు. రెండవ శ్రీశైలంగా పేరొందిన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం, చెరువుగట్టు బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవ్వాల సచివాలయంలో చెరువుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వాహణపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులతో బ్రహ్మోత్సవాల నిర్వాహణపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. అధికారులకు పలు సూచనలు చేశారు.
సచివాలయంలోని తన ఛాంబర్ లో బ్రహ్మోత్సవాల పోస్టర్, సమాచార కరపత్రాన్ని విడుదల చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఈ నెల 14 న జాతర ప్రారంభం అవుతుందని.. 16వ తేది అర్ధరాత్రి కళ్యాణోత్సవం ప్రారంభమై 17వ తేది ఉదయం ముగుస్తుందని.. స్వామివారికి అధికారికంగా తలంబ్రాలు సమర్పిస్తామని.. ఈ ఘట్టాన్ని భక్తులందరు తిలకించేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణ, ఆంధ్రపదేశ్ నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం భోజనం, రాత్రి బస చేసేందుకు గుడారాలు, మంచినీటి వసతి, మరుగదొడ్ల వంటి సకల సదుపాయాలు చేయాలని.. ఎక్కడా భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు ఉండాలని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. అంతేకాదు.. జాతరకు వచ్చిపోయే దారుల్లో రెండు వరసల్లో డెకరేషన్ లైట్లను ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని ఎలక్ట్రిసిటీ అధికారులను ఆదేశించారు.