Kolleru Lake: ఏలూరు జిల్లాలోని కొల్లేరులోకి వరద నీరు భారీగా పెరిగింది. వరద ప్రభావంతో కొవ్వాలంక, పెనుమాకులంక, నందిగామ లంక, మణుగూరు గ్రామాలు నీట మునిగాయి. మునిగిన గ్రామాలకు వెళ్లి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రజల బాగోగులను తెలుసుకుంటున్నారు. కొల్లేరుకు పెరిగిన వరద ఉధృతి కారణంగా ముంపు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పెదపాడు మండలం వసంతవాడ జడ్పీ హైస్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రంలో 60 కుటుంబాలు తలదాచుకుంటున్నాయి. మరింత మంది బాధితులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కొల్లేరు పెరగడంతో కైకలూరు నుంచి ఏలూరు వెళ్లే మార్గాన్ని నిలుపుదల చేశామని కైకలూరు టౌన్ సీఐ కృష్ణ వెల్లడించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని, అవసరమైతే గాని ప్రజలు బయటకు రావద్దని ఇంటి వద్ద ఉండాలని సీఐ ప్రజలకు సూచించారు.
Read Also: Budameru: బుడమేరు వద్ద యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీస్ అధికారి
బుడమేరు తీసుకువస్తున్న వరద కొల్లేరు పరివాహక ప్రాంతాలలో కల్లోలం సృష్టిస్తోంది. లంక గ్రామాలతో పాటు పరివాహక ప్రాంతాల రహదారులపై వరద నీరు ప్రవహించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరదకు తోడు భారీ వర్షాలు కురుస్తుండడం లంకవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొల్లేరులో నీటిమట్టం పెరగడంతో పెదపాడు మండలం కడిమికుంట పరిసర గ్రామాల్లో వరద నీరు చేరింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా పంట పొలాలు చేపల చెరువులను కొల్లేరుకు వచ్చిన వరద ముంచెత్తుతోంది. ఇప్పటికి ఇళ్లను ముంచెత్తడంతో బాధితులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. వరద మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొల్లేరు ప్రాంత రాసుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. ఓవైపు బుడమేరు, మరోవైపు తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వాగుల నుంచి వరద నీరు కొల్లేరులో చేరడం.. దీనికి వర్షం తోడు కావడంతో ముంపు సమస్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొల్లేరు ముంపు సమస్య ఎక్కువ కావడంతో లోతట్టు ప్రాంత వాసులను పునరవాస కేంద్రాలకు తరలించే పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. అయితే చాలామంది తమ ఇళ్ళు, పశువులు ఏమవుతాయనే ఆందోళనతో ముంపు ప్రాంతాల్లోనే ఉండిపోతున్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా వరద ముంచుకు రావడంతో ఆయా ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. వృద్ధులు, పిల్లలతో ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడూ చూడని విధంగా కొల్లేరు ప్రాంతవాసులు ఆందోళనకు గురవుతున్నారు. కొల్లేరు నీటిమట్టం పెరగడంతో దెందులూరు,ఏలూరు రూరల్, ఉంగుటూరు, ఉండి, కైకలూరు నియోజకవర్గం పరివాహక ప్రాంతాల వాసులకు కష్టాలు తప్పడం లేదు.