Kodali Nani: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఆరోపణలు, విమర్శలు.. నేతల మధ్య మాటల తూటాలు పేల్చుతున్నాయి.. ఇక, తాను తలుపులు తెరిస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబుకు మతిభ్రమించి తమ పార్టీలో జరుగుతోన్న సీట్ల వ్యవహారంపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2019లోనే ఏపీ ప్రజలు చంద్రబాబు తలుపులు, కిటికీలు పీకి.. హైదరాబాద్‌కు పార్సిల్ చేశారని ఎద్దేవా చేశారు..
Read Also: Yash Puri: శాపం చుట్టూ హ్యాపీ ఎండింగ్..క్లైమాక్స్ అస్సలు మిస్సవ్వద్దు..
చంద్రబాబు రా కదిలిరా సభల్లో ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేక సీఎం వైఎస్ జగన్ ను తిడుతున్నారు అని దుయ్యబట్టారు కొడాలి.. 2019లోనే చంద్రబాబును ప్రజలు హైదరాబాద్ పార్సిల్ చేశారన్నారు.. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే 58 మంది అభ్యర్థులను మార్చారు, మరో 10 నుంచి 15 మంది అభ్యర్థులను మారుస్తారని చెప్పుకొచ్చారు. సీట్లు రాని, మేం తీసేసిన వాళ్లు మాత్రమే టీడీపీలో చేరుతున్నారని తెలిపారు.. ఇక, టీడీపీ, జనసేన పొత్తులో సీట్ల ప్రకటన చేసి తర్వాత అభ్యర్థులు టీడీపీ, జనసేన కొంప తగలెడతారని.. చంద్రబాబు ఇంటి దగ్గర ఫైరింజన్ పెట్టుకోవాలి అంటూ హాట్ కామెంట్లు చేశారు.. చంద్రబాబుకు క్రెడిబిలిటీ లేని నాయకుడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేం కొత్త మేనిఫెస్టో తో వచ్చి చంద్రబాబుకు దిమ్మదిరిగేలా చేస్తాం.. వచ్చేసారి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా రాదు అని జోస్యం చెప్పారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.