Union Minister Kishan Reddy: రాష్ట్ర ప్రభుత్వ హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రైతుల విషయంలో ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందని విమర్శించారు. తాజాగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారు. రుణమాఫీ విషయంలో చాలా మంది రైతులు బ్యాంకుల్లో డిఫల్టర్లుగా మారారని.. రైతులు అనేక ప్రాంతాల్లో రోడ్ల పైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉందని ఆరోపించారు. రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అండగా ఉన్నా.. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతుందో అర్థం కావడం లేదన్నారు.. UPA హయాం కంటే ధాన్యం గిట్టుబాటు ధరను కేంద్రం పెంచిందని చెప్పారు. అయినా కూడా కొనుగోలు విషయంలో ఎందుకు విఫలం అవుతున్నారో తెలియడం లేదని.. మంత్రులు కౌంటర్ల ఇవ్వడం పైనే పనిచేస్తున్నారు తప్పా కొనుగోలు విషయంపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. మద్దతు ధర పెంచి బోనస్ ఇస్తామని అన్నారు.. ఆ తరువాత సన్న వడ్లకు మాత్రమే అన్నారని గుర్తు చేశారు. ఆరుగాలం పండించి తెచ్చి కళ్ళల్లో పెడితే కొనే దిక్కులేదని అసహనం వ్యక్తం చేశారు. బస్తాలు, సుతిలి దారం నుంచి అన్ని కేంద్రం అందిస్తుందని చెప్పారు. నిల్వ కేంద్రాల ఖర్చు కూడా కేంద్రమే ఇస్తుందన్నారు.
అయినా కూడా కొనుగోలు ఎందుకు జరగడం లేదో ప్రభుత్వం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.. “ప్రతి కేజీకి 40 రూపాయలు కేంద్రమే ఇస్తుంది. మళ్ళీ పేద ప్రజలకు కేంద్రం అవే బియ్యం రేషన్‌పై ఇస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 5 కేజీల బియ్యం కేంద్రం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నామని చెబుతున్న సన్న బియ్యంలో కూడా 60 నుంచి 65 శాతం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది.. ఇది నిజం కాదని చెప్పాగలరా..? ఉచితంగా ఒక్కొక్కరికీ 5 కేజీల బియ్యం ఇస్తున్న ఘనత మన కేంద్ర ప్రభుత్వందే. ప్రతీ రైతుకి పత్తి మీద లాభం కలిగేలా కేంద్రం చర్యలు చేపట్టింది. వడ్లతో పాటు పత్తి కూడా తెలంగాణాలో ఉత్పత్తి వస్తుందని ప్రధాని చెప్పారు. ఈ రెండు పంటల రైతులను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత. ప్రతి చివరి కేజీ వరకు పత్తి కొనే బాధ్యత కేంద్రం తీసుకుంటుంది. రాష్ట్ర మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో జిల్లాకు వెళ్ళండి. అక్కడ ఎందుకు కొనుగోలు జరగడం లేదు తెలుసుకోండి. కేవలం హైదరాబాద్ లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం కాదు. రైతుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించండి. కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా రైతులను ఆదుకుంటుంది. యూరియా 220 రూపాయలకు సబ్సిడీలో అందిస్తుంది. ఫసల్ భీమా యోజన ద్వారా దేశ రైతులకు అండగా నిలిచింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల విషయంలో అండగా వ్యవహారించాలి.” అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.
