Kishan Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెంగళ్ రావు నగర్ డివిజన్, మధురానగర్‌లో ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై, మజ్లిస్ పార్టీ పెట్రేగిపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆదివారం ముఖ్యమైన నాయకులు భారీ ఎత్తున పాల్గొంటారని ఆయన తెలిపారు.
మజ్లిస్ పార్టీకి చెందిన వ్యక్తి గోరక్షకుడిపై విచక్షణా రహితంగా దాడి చేసి, హత్యాయత్నం చేయడం దారుణమని కిషన్ రెడ్డి ఖండించారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి అద్దం పడుతోందని అన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నంత కాలం మజ్లిస్ పార్టీని పెంచి పోషించి, ఆ పార్టీ కనుసన్నల్లోనే పనిచేసిందని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మజ్లిస్ పార్టీని బీఆర్‌ఎస్ బాటలోనే పెంచి పోషిస్తోందని విమర్శించారు. గోవులను రక్షిస్తున్న వ్యక్తిపై తుపాకులతో కాల్పులు జరిపి దాడి చేసే స్థాయికి వెళ్లారంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మజ్లిస్ పార్టీ రౌడీయిజం, గూండాయిజం ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
మజ్లిస్ పార్టీ నాయకుల దగ్గర అక్రమంగా తుపాకులు ఉన్నాయని, రాష్ట్రంలో ఆ పార్టీ ప్రమాదకర శక్తిగా, మతోన్మాద శక్తిగా పెట్రేగిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గతంలో పనిచేసిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పనిచేసే పరిస్థితి లేదని అన్నారు. మజ్లిస్ పార్టీ అక్రమాలను, దుర్మార్గాలను తుదముట్టించాలంటే బీజేపీతోనే సాధ్యం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీ తరఫున గతంలో పనిచేసిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం ఆ పార్టీ దివాళాకోరు తనానికి అద్దం పడుతోందని ఆయన విమర్శించారు.
Smriti Mandhana: ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన స్మృతి మంధాన!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం చాలా నిర్లక్ష్యానికి గురైందని, చుట్టుపక్కల నియోజకవర్గాలు అభివృద్ధి చెందినా జూబ్లీహిల్స్‌లో మాత్రం అనేక సమస్యలు ఉన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ వెనుకబాటుతనానికి గతంలో పదేళ్లుగా బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు. సమర్థుడైన బీజేపీ అభ్యర్థి లంక దీపక్ రెడ్డిని గెలిపించాలని ఆయన జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు.