Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలోని పాలక పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఉపయోగం కన్నా నష్టం ఎక్కువగా కలిగించిందని, దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ లేనిదిగా బీజేపీ గతంలోనే చెప్పిందని, ఇప్పుడు కూడా సీబీఐ విచారణ కోరుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీబీఐ విచారణపై మొహం మార్చుకుందని వ్యాఖ్యానించారు.
Read Also: Manchu Vishnu: రజనీకాంత్ హగ్.. 22 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నానన్న విష్ణు..!
అలాగే బీసీ గణనపై మాట్లాడుతూ, దేశ స్వాతంత్రం తర్వాత తొలిసారి బీసీ జనాభా సేకరణ జరుగుతోందని పేర్కొన్నారు. జనగణనలో వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. మోదీ 11 ఏళ్ల పాలనపై బీజేపీ చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం సమయం తీసుకుంటోందని చెప్పారు. ఇప్పటికే ఎన్నికలు ఆలస్యం అయ్యాయని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరగాలే కానీ తూతూ మంత్రంగా కాకూడదని హితవు పలికారు. అన్ని స్థానాల్లో బీజేపీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని చెప్పారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో బీజేపీ పిటిషన్ వేసిందని, అది పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం సీబీఐకి కేసు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తమ ఫోన్లను ట్యాప్ చేశారన్నది హైకోర్టుకు ఇచ్చిన ప్రభుత్వ నివేదికలో కూడా ఉందని వెల్లడించారు. అలాగే గోదావరి జలాల విషయంపై రాష్ట్రాల మధ్య సంప్రదింపులు జరిపి పరిష్కారం వెతుకుతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రెండు ప్రభుత్వాలు కలిసి చర్చించుకోవాలన్నది ఆయన అభిప్రాయం. రెండు రాష్ట్రాల ప్రజలు “మనవారే” అనే భావనతో కలిసి పనిచేయాలన్నారు.
Read Also: The Rajasaab : ఇద్దరు హీరోయిన్లు కావాలన్న ప్రభాస్.. ముగ్గురిని దించిన మారుతి..
కేసీఆర్ గతంలో “బేసిన్లు లేవు, భేషజాలు లేవు” అని అన్నారని, ఇప్పుడు మాత్రం ఆయనే మౌనంగా ఉన్నారని విమర్శించారు. మూడు టీఎంసీలు పోతున్నా, కేసీఆర్ తన ఫార్మ్‌హౌస్‌లో నిద్రిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని, ప్రజలు ఈ రెండు పార్టీలను తిరస్కరించారని అన్నారు. ఇక కేసీఆర్ ప్రభుత్వం గతంలో మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేయలేదని, మౌలిక వసతుల లోపం కారణంగా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని కిషన్ రెడ్డి తెలిపారు. కొత్త ప్రభుత్వంపైనా ఇదే పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు.
ఇక తాజాగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన పార్టీ కార్యకర్త. పార్టీ కోసం త్యాగాలు చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. అయినా, ఆయన చెప్పిన మాటలపై పార్టీ లోపల చర్చిస్తామని చెప్పారు. చివరిగా హింస ద్వారా మార్పు రాదని, ఆయుధాలను వదిలి పెట్టి శాంతి మార్గాన్ని అనుసరించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో మార్పు హింసతో కాదు, చర్చతో సాధ్యమవుతుందని అన్నారు.