Kishan Reddy throws a bold challenge to Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా మరలా గెలిస్తే.. తాను దేనికైనా సిద్ధం అని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే.. రాహుల్ ఏం చెప్పినా చేయడానికి తాను సిద్ధం అని చెప్పారు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో తిరిగి వచ్చే అవకాశం లేదని, అడ్డంగా ఓడిపోవడం ఖాయం అని అన్నారు. సూర్యుడిపై ఉమ్మినట్లు.. ప్రధాని నరేంద్ర మోడీ గారిని కాంగ్రెస్ విమర్శిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాశారు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పోరుబాట ధర్నాపై కిషన్ రెడ్డి స్పందించారు.
‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రాకముందు నుంచే అబద్ధాలు చెప్పింది. అమలు కానీ హామిల్చింది. ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల పేరుతో ఆశ చూపించి ప్రజలను మోసం చేసింది. చేతకాని తనంతో చేతులు ఎత్తేసి.. ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. తమ నిస్సహాయతను బీజేపీ, కేంద్రం, మోడీపై నెడుతున్నారు. తెలంగాణలో ఇచ్చిన హామీలకు రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు కూడా పూర్తి బాధ్యత వహించాలి. ఎన్నో డిక్లరేషన్‌ల పేరుతో ఆయా వర్గాలను మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక, ఏ డిక్లరేషన్‌ను డెడికేషన్‌తో అమలు చెయ్యడం లేదు. బీసీలకు లక్ష కోట్లు ఇస్తాం అన్నారు.. ఎందుకు ఇవ్వలేదు. డిల్లీ బాట పట్టి స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారు. డిల్లీ ప్రదక్షణ తప్ప.. తెలంగాణకు రేవంత్ చేసిందేమీ లేదు’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
Also Read: Sourav Ganguly: మరోసారి సౌరవ్ గంగూలీ పోటీ.. ఈసారి కూడా ఏకగ్రీవమేనా!
‘బీసీలకు ఇచ్చిన హామీల్లో ఏ హామీ కూడా అమలు చెయ్యడం లేదు. అద్దాల మేడలో కూర్చుని.. ఇతరుల మీద రాళ్ళు రువ్వే ప్రయత్నం చేస్తున్నారు. బీసీలకు సామాజిక సాధికారత కల్పించే ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు. నిన్నటి ధర్నాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను పొగడటం, మోదీని విమర్శించడానికే సరిపోయింది. రేవంత్ రెడ్డి ఎడాపెడా మాట్లాడేందుకు రేవంత్ ధర్నా. ధర్నాకు కాంగ్రెస్ పెద్దలు ఎందుకు రాలేదు. న్యాయబద్దంగా, చట్టబద్దంగా, నిపుణులతో మాట్లాడి బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు అమలు చెయ్యాలి. రేవంత్ రెడ్డి పాలనలో వైఫల్యం, రాజకీయంలో వైఫల్యం, హామీలు అమలు చెయ్యడంలో వైఫల్యం.. అవినీతిలో మాత్రం సక్సెస్ అయ్యారు. గత ప్రభుత్వ కేసీఆర్‌తో అవినీతిలో పోటీ పడుతున్నారు. అవినీతి, అప్పుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. మజ్లిస్ పార్టీ కనుసైగలో ముస్లింలకు కేసీఆర్ రిజర్వేషన్లు ఇచ్చాడు. ఇపుడు రేవంత్, కాంగ్రెస్ కూడా 34 నుంచి 32కు కుదించే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ జనాభా ప్రాతిపదికన 42 శాతం ఇవ్వడం లేదు. కులగణనలో తప్పులు చేశారు’ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.