నిజ్జర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందుతుల్లో ఒకరు స్టూడెంట్ వీసాతో కెనడాలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. గ్లోబల్ న్యూస్‌లో ఒక కథనం ప్రకారం.. ఖలిస్థాని వేర్పాటువాద ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో అరెస్టయిన ఒకరు భారత్ నుంచి స్టూడెంట్ వీసా ఆధారంగా కెనడాలోకి ప్రవేశించారు. అతను పంజాబ్‌లోని భటిండాలోని ఎథిక్‌వర్క్స్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ద్వారా విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు చేసుకున్న కొన్ని రోజుల్లోనే వీసా పొందాడు. సాధారణంగా అయితే ఈ వీసా రావడానికి సుమారు 7-9 వారాల సమయం పడుతుంది. ఎథిక్స్‌వర్క్స్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తన ఫేస్‌బుక్ పేజీలో బ్రార్ ఫోటోతో పాటు ఒక వీడియోను పోస్ట్ చేసింది. అతను కెనడియన్ స్టడీ పర్మిట్‌తో పాస్‌పోర్ట్‌ను కలిగి ఉన్నట్లు పేర్కొంది. అయితే ఇప్పుడు ఆ వీడియోను తొలగించారు.
READ MORE: Uttarpradesh : 29ఏళ్ల నాటి కేసు.. 100వారెంట్ల తర్వాత కూడా హాజరుకాని ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్
ఏప్రిల్ 30, 2020న కాల్గరీలోని బో వ్యాలీ కాలేజీలో బ్రార్ చదువు ప్రారంభించినట్లు గ్లోబల్ న్యూస్ నివేదించింది. అతను మే 4, 2020న ఎడ్మోంటన్‌కు మారాడు. బ్రార్ ఎనిమిది నెలల కోర్సులో చేరారని కళాశాల ప్రతినిధి తెలిపారు. అయితే, నిజ్జర్ హత్య కేసులో అరెస్టయిన వ్యక్తి ఇతడేనని అధికార ప్రతినిధి ధ్రువీకరించలేదు. ఎథిక్‌వర్క్స్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అనే కంపెనీతో తమకు ఎప్పుడూ అనుబంధం లేదని కళాశాల తెలిపింది. మే 3న అల్బెర్టాలోని ఎడ్మంటన్‌లో నిజ్జర్ కేసుకు సంబంధించి ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అందులో బ్రార్‌తో పాటు కరణ్‌ప్రీత్ సింగ్, కమల్‌ప్రీత్ సింగ్ ఉన్నారు. ముగ్గురు నిందితులు భారత ప్రభుత్వానికి సంబంధం కలిగి ఉన్నారని కెనడా పోలీసులు ఎటువంటి ఆధారాలు అందించలేదు. వారికి భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా కెనడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గత సంవత్సరం, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఈ ఘటనకు భారత ప్రభుత్వ ఏజెంట్లను నిందించారు. భారత ప్రభుత్వం ఈ వాదనను అసంబద్ధంగా కొట్టిపారేసింది.