Kerala: కేరళలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తిరువనంతపురం నుంచి 16 ఏళ్ల బాలుడిని అతని తల్లి, సవతి తండ్రి ఇస్లామిక్ స్టేట్‌లో చేరమని ఒప్పించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, UAPA కింద కేసు నమోదు చేశారు. అంతే కాదు.. తన తల్లి ఏకంగా ISISలో చేరాలని.. ఆ భావజాలాన్ని పెంపొందించుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
READ MORE: Semiyarka: అద్భుతం.. బయటపడ్డ 3,600 ఏళ్ల నాటి కంచు యుగం నగరం..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువనంతపురం పతనంతిట్టకు చెందిన ఓ మహిళ ఇస్లాం మతంలోకి మారి, వెంబయంకు చెందిన వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఈ జంట UKలో నివసిస్తున్నారు. బాలుడు(16) ఇటీవల UKకి వెళ్లాడు. అయితే.. అక్కడ అతడి తల్లి, సవతి తండ్రి కొన్ని వీడియోలు చూపించి, ఐసీస్ (ISIS) భావజాలం వైపు ఆకర్షించేలా ప్రయత్నించారని బాలుడు ఆరోపించారు. ఇటీవల ఆ టీనేజర్ తిరిగి కేరళకు వచ్చారు. అనంతరం అతడిని అట్టింగల్‌లోని ఒక మత అధ్యయన కేంద్రంలో చేర్పించారు. అక్కడి ఉపాధ్యాయులు విద్యార్థి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పును గమనించారు. తల్లి, బంధువులకు వెంటనే సమాచారం అందించారు. దీంతో ఆ బాలుడి మామ ఈ విషయంపై ఆ టీనేజర్ నిలదీశాడు. దీంతో జరిగిన విషయాన్ని వివరించాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన టీనేజర్ మామ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ అంశంపై పోలీసులు కేసు నమోదు చేసి, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. టీనేజర్ భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, మానసిక కౌన్సెలింగ్ అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంతలో బాలుడి తల్లి ఈ ఆరోపణలన్నింటినీ పూర్తిగా తోసిపుచ్చింది. తాను రెండో వివాహం చేసుకోవడంతో, తన మొదటి(విడిపోయిన) భర్త ఇలాంటి ఆరోపణలు చేయడానికి బిడ్డను ఉపయోగిస్తున్నాడని ఆమె చెబుతోంది. తాను యూకేలో నర్సుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నానని ఈ ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తల్లి పోలీసులకు తెలిపింది. మరోవైపు.. UAPA కింద అట్టింగల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దర్యాప్తునకు నాయకత్వం వహిస్తున్నారు. ఉగ్రవాద నిరోధక సంస్థ అయిన NIA (జాతీయ దర్యాప్తు సంస్థ) కూడా ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం ప్రారంభించింది. తిరువనంతపురం గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్, యాంటీ-టెర్రర్ స్క్వాడ్ వంటి ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.