సార్వత్రిక ఎన్నికల ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవల ఒడిషా ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు రూ.9 వేల స్కాలర్‌షిప్ ప్రకటించింది. షెడ్యూల్ కులాలకు రూ.10 వేలు ఉపకార వేతనం ప్రకటించింది. ఇప్పుడు తాజాగా కేరళ ప్రభుత్వం (Kerala Government) కూడా పాఠశాల విద్యార్థుల కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో లంచ్ బ్రేక్ మాదిరిగానే… వాటర్ బ్రేక్ (Water Break) ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో కేరళ ప్రభుత్వం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో విద్యార్థులకు లంచ్ బ్రేక్ ఇచ్చినట్లుగా వాటర్ బ్రేక్ ఇవ్వనుంది. వేసవిలో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా.. తగినంత నీరు తాగేలా చూడాలనే లక్ష్యంతో పాఠశాలల్లో ‘వాటర్-బెల్’ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది.
2019లో దేశంలోనే మొదటిసారి ఈ విధానాన్ని కేరళలోని కొన్ని స్కూళ్లలో ప్రారంభించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిత్వ కార్యాలయం తెలిపింది. అనంతరం ఈ విధానాన్ని కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు సైతం అమలుచేశాయని పేర్కొంది. దీనిని పరిగణలోకి తీసుకొని ఈనెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇకపై పాఠశాలల్లో ఉదయం 10.30 గంటలకు.. మధ్యాహ్నం 2.30 గంటలకు ఐదు నిమిషాల పాటు విద్యార్థులకు నీరు తాగడానికి విరామం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇది పిల్లల్లో డీహైడ్రేషన్.. ఇతర అనారోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని వివరించారు.