ఈ ప్రభుత్వ హయాంలో రైతు బంధు, రైతు బీమా ఉంటుందో.. ఉండదో తెలియని పరిస్థితి ఏర్పడిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. బస్సు యాత్రలో భాగంగా సూర్యాపేటకు చేరుకున్న ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటికే కరెంట్ మాయమైపోయిందన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. రైతు పండించిన ధాన్యం కొనుగోలులో సర్కార్ విఫలమైందని విమర్శించారు. రుణ మాఫీ ఏమైంది.? దళిత బందు ఉంటుందో లేదో తెలియదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న పొరపాటు జరిగితే.. సరిదిద్దకుండా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాగార్జునసాగర్ నుంచి నీళ్లు ఇవ్వడానికి చేతకావడం లేదని విమర్శించారు.
READ MORE: Shocking Video: ఉన్నట్టుండి ఎంత ఘోరం.. గోడపడి నలుగురి దుర్మరణం.. వీడియో వైరల్..
నాగార్జున సాగర్ నీళ్ల దోపిడీ జరుగుతుంటే సాగునీటి శాఖ మంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ను భయపెడితే భయపడడని.. ఒక వేళ భయపడి ఉంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. నా ప్రజలు బాధపడితే.. వాళ్ళ కోసం నా ప్రాణం పోయినా లెక్కచేయనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగానే రైతుబంధు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ బలమని తెలిపారు. మంచి మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థులను పార్లమెంటుకు పంపాలని కోరారు. పార్లమెంటులో బలం ఉంటేనే తెలంగాణ హక్కులు కాపాడబడతాయని స్పష్టం చేశారు. మొదటి రోజు కేసీఆర్ బస్సు యాత్ర ముగిసింది.సూర్యాపేటకు చేరిన ఆయన రాత్రి అక్కడే బస చేయనున్నారు. తిరిగి రేపు ఉదయం సూర్యాపేట నుండి భువనగిరి వరకు కేసీఆర్ రెండవ రోజు బస్సు యాత్ర కొనసాగుతుంది.