CM KCR Delhi Tour : తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు(సోమవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 14న బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆయన రేపు రాజధానికి పయనం కానున్నారు. ఢిల్లీలో డిసెంబర్ 14న ఎస్పీ రోడ్ లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారభించనున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని , జాతీయ కార్యవర్గాన్ని అదే రోజు ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందుగానే మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ లు కార్యాలయం ప్రారంభ పనులను చూసుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి మంత్రులంతా..ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను తీసుకొని రావాలని కేసీఆర్ ఆదేశించారు.
Read Also: Delhi BJP Chief Reign: ఢిల్లీ బీజేపీ అధ్యక్ష పదవికి ఆదేశ్ గుప్తా రాజీనామా
శాశ్వత భవనం నిర్మాణంలో ఉన్నందున.. ప్రస్తుతానికి ఒక భవనాన్ని పార్టీ కార్యకలాపాల నిమిత్తం అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. దాన్నే సీఎం కేసీఆర్ 14న ప్రారంభించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీఆర్ఎస్ కార్యాలయంలో ఇప్పటికే పెయింటింగ్, రిపేర్ వర్క్స్ పూర్తయ్యాయి. కార్యాలయానికి చేయాల్సిన మార్పులపై సిబ్బందికి ఇదివరకే పలు సూచనలు చేశారు కేసీఆర్. మూడు రోజుల్లో పనులన్నీ పూర్తి చేయాలని వర్కర్లకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సర్ధార్ పటేల్ రోడ్ లో భారీ భవనాన్ని బీఆర్ఎస్ కోసం ఏడాది పాటు అద్దెకు తీసుకున్నారు. ఇక దేశ రాజకీయాల్లో కొత్త రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భవించింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్పు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావానికి సంబంధించి ఈసీ పంపిన లేఖ పై 9వ తేదీన కేసీఆర్ సంతకం చేశారు. దీంతో 14వ తేదీ తరువాత పార్టీపరంగా జాతీయ అంశాలపై కేసీఆర్ దృష్టి సారిస్తారు. ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత శాసనసభ సమావేశాలపై నిర్ణయం తీసుకుందామని మంత్రులతో సీఎం పేర్కొన్నట్టు సమాచారం.