Kantara Chapter 1: నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించి, హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. హోంబాలే ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగానే కాక, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన ఏకకాలంలో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఘనంగా విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ, నిన్నటి వరకు 818 కోట్లు (ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు) కలెక్ట్ చేసినట్లుగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం ఈ చిత్రం ఏకంగా $1000 కోట్ల వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది. రిషబ్ శెట్టి నటనకు, దర్శకత్వానికి విమర్శకుల ప్రశంసలు దక్కుతుండగా, హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ ఆకట్టుకుంది. అలాగే, కీలక పాత్రలలో జయరామ్ మరియు గుల్షన్ దేవయ్య వంటి నటులు మెప్పించారు. కాగా, ఈ సినిమా ఇంగ్లీష్ డబ్బింగ్ వర్షన్‌ను కూడా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 31వ తేదీన ‘కాంతార చాప్టర్ 1’ ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్ విడుదల కానుంది. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ ఏకంగా 100 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత రిషబ్ శెట్టి ఎలాంటి సినిమా చేస్తారా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఎందుకంటే ఆయన లైనప్ కూడా అంత ఆసక్తికరంగా ఉంది.