ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం నడుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా.. కేసును ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించింది. కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. డీఎస్పీ యాక్ట్ సెక్షన్ 6 కింద రాష్ట్రం నుంచి కేంద్రానికి నోటిఫికేషన్ వెళ్లింది. రాష్ట్రంలో సీబీఐకి జనరల్ కన్సెంట్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేంద్రం కూడా సెక్షన్ 5 కింద నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు సీబీఐ విచారణకు సంబంధించిన ప్రక్రియ మొదలు అవుతుంది. కేంద్రం కన్సెంట్ లేకుండా సీబీఐ విచారణ చేయదు. కేంద్రం సెక్షన్ 5 ప్రకారం.. ఎప్పుడు కన్సెంట్ ఇస్తుంది? ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. సీబీఐకి కేంద్రం అనుమతి ఇస్తే.. రాష్ట్రంలో ఏదో ఒకచోట కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. గతంలో మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్‌లో కాళేశ్వరం కూలినప్పుడు ఇచ్చిన పిటిషన్‌పై ఇప్పటికే కేసు నమోదు అయింది. అప్పట్లో ఇంజనీరింగ్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా విచారణ సాగుతుందా? లేదా కొత్తగా కేసు పెడతారా? అన్నది చూడాలి.
Also Read: Niranjan Reddy: కాసేపట్లో అంత్యక్రియలు, మాజీ మంత్రి పిలుపు.. పాడే మీది నుంచి లేచొచ్చిన వీరాభిమాని!
సీబీఐ విచారణకు కేంద్ర హోం శాఖ అంగీకరిస్తే.. కాళేశ్వరం బ్యారేజీలపై దర్యాప్తు మరలా ప్రారంభం అవుతుంది. కాళేశ్వరంపై సీబీఐ కేసు నమోదు చేస్తే.. వెంటనే ఈడీ ఎంటర్ కావచ్చు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన అధికారులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆ దాడులలో వందల కోట్లు పట్టుబడ్డాయి. సీబీఐ సహా ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. చూడాలి మరి కాళేశ్వరంపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో.