Kaleswaram Commission: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ తిరిగి ప్రారంభం కానుంది. గతంలో కమిషన్ ఎదుట హాజరైన వ్యక్తుల్లో కొందరిని మళ్లీ విచారణ చేయాలని నిర్ణయించింది. ఈ విచారణలో ముఖ్యంగా అనుమతులు, నిర్మాణ పనుల్లో కీలకంగా వ్యవహరించిన ఇంజినీర్లను ప్రశ్నించనుంది. కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లు, విచారణలో చెప్పిన అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కమిషన్ భావిస్తోంది. అందువల్ల, నిజమైన అంశాలను వెలికితీయడానికి ఈ దర్యాప్తును మరింతగా క్షుణ్ణంగా నిర్వహించనున్నట్లు సమాచారం.
Read Also: Telugu Language: ప్రయాగ్‌రాజ్‌లో తెలుగు భాషకు గౌరవం
ఇక కృష్ణా జలాల పంపిణీపై నేడు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపిణీపై ఈ భేటీలో చర్చ జరగనుంది. ఏపీ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే పలుమార్లు ఈ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారుల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ 63 టీఎంసీల నీరు అవసరమని పేర్కొనగా, ఆంధ్రప్రదేశ్ 55 టీఎంసీలు కావాలని అభిప్రాయపడింది. తాజాగా జరిగిన చీఫ్ ఇంజినీర్ల సమావేశంలో ఈ లెక్కలను తేల్చేందుకు చర్చ జరిగింది. ఈ సమావేశం తర్వాత KRMB భేటీకి హాజరుకావాల్సిన ఏపీ ఎన్‌సీ (ENC) గైర్హాజరయ్యారు. దీని కారణంగా తెలంగాణ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. KRMB సమావేశానికి గైర్హాజరవడం ద్వారా ఏపీ మునుపటి ఒప్పందాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలంగాణ ఆరోపించింది.
గత సమావేశంలో 23 టీఎంసీకి ఏపీ అంగీకరించినప్పటికీ, ఇప్పుడు వారి హాజరుకాకపోవడంపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్నటి భేటీని అధికారికంగా మినెట్ చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. మల్యాల, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాంతాలకు నీటి తరలింపును తక్షణమే ఆపాలని తెలంగాణ అధికారుల డిమాండ్ చేశారు. అంతేకాకుండా శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ నీళ్లు వాడరాదని తెలంగాణ అధికారులు హెచ్చరించారు.
Read Also: SLBC Tunnel Accident: ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్.. జీరో పాయింట్ దగ్గరకు చేరుకున్న బృందం
ఇక ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 36.53 టీఎంసీలు నీరు ఉంది. అందులో ఏపీకి అవసరమైన నీరు 10 టీఎంసీలు కాగా.. తెలంగాణకు 13.16 టీఎంసీలు అవసరం. అలాగే నాగార్జునసాగర్‌లో 30.575 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణ 50.10 టీఎంసీలు కోరుతోంది. మొత్తం రెండు జలాశయాల్లో కలిపి అందుబాటులో ఉన్న నీరు 67.093 టీఎంసీలు కాగా.. అయితే, రాష్ట్రాల అవసరాలను చూసినట్లయితే మొత్తం 118 టీఎంసీలు అవసరమవుతున్నాయి. ఈ భేటీలో రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న విభేదాలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ ఈ సమావేశంలో ఒక తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.