SLBC Tunnel Accident: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో జరిగిన భయంకరమైన ప్రమాదం దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగించింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల విషయంలో అధికారులు ఆశలు వదులుకుంటున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తుండటంతో కార్మికులు ప్రాణాలతో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నెల్‌లో భారీ ఎత్తున మట్టి కూలిపోవడం, నీరు, బురద చేరడంతో వారు బయటపడే అవకాశం మరింత తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు. కార్మికులు టన్నెల్ బోరింగ్ మెషీన్ (TBM) చుట్టూ బురదలోనే కూరుకుపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాదం శనివారం ఉదయం 8:30 గంటలకు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు మొదలైనప్పటికీ, ఇప్పటివరకు రెస్క్యూ ఆపరేషన్ నడుస్తూనే ఉంది. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్పందించారు. మూడు రోజుల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. బుధవారం నాటి సమావేశంలోనూ ప్రధాని మోదీ ప్రత్యేకంగా టన్నెల్ ప్రమాదంపై ఆరా తీశారు.
Also Read: Online Love Scam: ఇలా ఉన్నారేంట్రా బాబు.. వాట్సప్ లోనే పరిచయం.. ప్రేమ..పెళ్లి.. కాపురం!
గడిచిన 120 గంటలుగా రెస్క్యూ బృందాలు టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. ప్రధానంగా NDRF (National Disaster Response Force), SDRF (State Disaster Response Force), నావల్ కమాండోలు (MARCOs టీమ్), బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) టీమ్‌లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. టన్నెల్‌లో భారీగా నీరు, మట్టికూడి ఉన్న కారణంగా రెస్క్యూ ఆపరేషన్ సులభంగా సాగడం లేదు. ఈ క్రమంలో PLASMA లేజర్ CUTTER లు ఉపయోగించి TBM మెషీన్ కటింగ్ చేపట్టారు. జియాలజీ నిపుణుల సూచనలతో టన్నెల్ డీ వాటరింగ్ (నీటిని బయటకు పంపే ప్రక్రియ) ద్వారా నీరు, బురదను తగ్గించారు. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు జీరో పాయింట్ దగ్గరకు చేరుకున్నాయి. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయడానికి 11 రెస్క్యూ టీమ్‌లు, 57 మంది రెస్క్యూ సభ్యులు నిరంతరం పనిచేస్తున్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను 24 గంటల్లో రక్షించాలనే లక్ష్యంతో అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.