ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు, సినీ నటుడు నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తెలుగుదేశం పార్టీని భాధకు గురిచేసిందన్నారు. రామ్మూర్తి నాయుడు గారు విప్ బాధ్యతలు తనకు అప్పగించారని, ఎంత బరువైనా పూర్తి సామర్థ్యంతో పని చేస్తానన్నారు. కడప నగరంలో మంచి నీరు, రోడ్ల సమస్యలు పరిష్కరిస్తా అని ఎమ్మెల్యే మాధవి రెడ్డి చెప్పుకొచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు.
కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మాధవి రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ… ‘రామ్మూర్తి నాయుడు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఆయన మరణం తెలుగుదేశం పార్టీని భాధకు గురి చేసింది. ఆయనే విప్ బాధ్యతలు నాకు అప్పగించారు. ఎంత బరువైనా పూర్తి సామర్థ్యంతో పని చేస్తా. నా మీద నమ్మకంతో భాధ్యతలు అప్పగించినందుకు సంతోషం. నా భర్త పోలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి సహకారంతో కడప నగరంలో మంచి నీరు, రోడ్ల సమస్యలు పరిష్కరిస్తాం. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇదే సమస్యపై అసెంబ్లీలో మాట్లాడాను. కార్పోరేషన్ ఏర్పడి 20 సంవత్సరాలు అయినా ఇప్పటికీ త్రాగు నీరు కొనే పరిస్థితి ఉంది. గత పాలకులకు ఈ సమస్య కనపడలేదా?. గత 10 సంవత్సరాలుగా కార్పోరేషన్లో అధికారంలో ఉన్నారు’ అని అన్నారు.
Also Read: Rammurthy Naidu: నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడి పార్థివదేహం.. నివాళులర్పించిన నేతలు!
‘కడప నగరం జిల్లా కేంద్రం. జిల్లా నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ జిల్లా నుంచి అయ్యారు. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్, వైసీపీ పాలనలో అభివృద్ధి తగ్గిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో డబ్బులు డ్రా చేసుకున్నారు. పనులు మాత్రం జరగలేదు. గత ప్రభుత్వ పాలన వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. సచివాలయం, మహిళా పోలీసు సమస్యలపై అసెంబ్లీ వేదికగా చర్చించాను. జాబ్ చార్ట్ లేకుండా మహిళా పోలీసు ఉద్యోగం కల్పించారు. ఇదే సమస్యపై హోం మంత్రితో చర్చించా’ అని ఎమ్మెల్యే మాధవి రెడ్డి చెప్పారు.