KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అమరావతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాశాంతి పార్టీ గుంటూరు జిల్లా కమిటీ ఏర్పాటు చేశామని.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది ఆన్‌లైన్‌లో ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని కేఏ పాల్ ఆరోపించారు. ఛారిటీ డబ్బు ఒక్క రూపాయి కూడా పార్టీకి వాడటం లేదన్నారు. ప్రతి గ్రామానికి సర్పంచ్ ద్వారా కోటి రూపాయలు ఇస్తానని ఈ సందర్భంగా చెప్పారు. ఐదు సంవత్సరాలలో రాజధాని ఎందుకు కట్టలేదని చంద్రబాబును కేఏ పాల్ ప్రశ్నించారు. బీజేపీ ప్రజాదర్బార్ పెడతారట, ఛార్జ్ షీట్‌లు వేస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. 3.5లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్‌ను తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని ఆయన ప్రశ్నించారు.
“నేను క్వాలిఫై కాదని అంటున్నారు. నన్ను ఎందుకు డిస్ క్వాలిఫై చేసారు. స్టీల్ ప్లాంట్ కోసం నేను కోర్టులో పిల్ వేశాను. నాతో ఎవరైనా డిబేట్‌కు వస్తారా..నేను రెడీ. చంద్రబాబు 5 లక్షల కోట్లు, జగన్ నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసారు. పవన్ కల్యాణ్ డ్యాన్స్ వేస్తే రాష్ట్రంలో అప్పులు తీరుతాయా. గతంలో నేను అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫండ్స్ ఇచ్చాను.హైకోర్టు న్యాయమూర్తిని నాకు టైం కేటాయించమని వేడుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్‌లో 44 వేలమంది ఉద్యోగులు రోడ్డున పడతారు. నన్ను స్టీల్ ప్లాంట్‌లో కి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. నాకు పర్మిషన్ ఇస్తే నాకున్న ఆస్తులు అమ్మి స్టీల్ ప్లాంట్‌కు కడతాను.ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాను.చంద్రబాబు కొడుకును ముఖ్యమంత్రిని చేయటానికి, దోచుకున్న ఆస్తులు దాచుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కుటుంబ పాలన, కుల పాలన మన కొద్దు.” అని కేఏ పాల్ అన్నారు.
Read Also: Online Studies: ఇక నుంచి ఆన్‌లైన్‌లో పాఠ్య పుస్తకాలు.. ఏపీలో సరికొత్త విధానం
జేడీ లక్ష్మీనారాయణను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించామని.. సానుకూలంగా స్పందించినట్లు కేఏ పాల్ తెలిపారు. గ్రామస్థాయిలో కమిటీలు వేస్తున్నామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ముప్పై లక్షల మంది కమిటీ సభ్యులు ఉన్నారన్నారు. దేశంలో లక్షల కోట్లు దోచుకుంటే కేంద్ర మంత్రులు, వేల కోట్లు దోచుకుంటే ముఖ్యమంత్రులు, వందల కోట్లు దోచుకుంటే మంత్రులు అవుతున్నారని కేఏ పాల్ ఆరోపణలు చేశారు.