తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. FITUR పేరుతో ప్రఖ్యాతిగాంచిన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లోని IFEMAలో జరుగుతున్న అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్ లో బుధవారం తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్ ను మంత్రి జూపల్లి కృష్ఱారావు ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకైన బోనాలను కనుల పండుగగా నిర్వహించారు. ఒగ్గుడోలు, ఒగ్గు కథ, కూచిపూడి, భారత నాట్య కళాకారులు నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. విదేశీ పర్యాటకులు సైతం వీటిని ఆసక్తిగా తిలకించారు.
అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ…. తెలంగాణ పర్యాటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందని కావాల్సిందల్లా పర్యాటక కేంద్రాలకు అవసరమైన రవాణా, ఇతర మౌలికవసతుల కల్పన చేపట్టడమేనని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వివిధ ప్రాంతాల్లో జరిగే పండగలు, పురాతన కట్టడాలు ఇలా ప్రతిచోటా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయని, ఆ దిశగా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పర్యాటక రంగం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవడంతోపాటు, ఉపాధి కల్పనకు బాటలు పడతాయని తెలిపారు.