Off The Record: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విసిరిన గూగ్లీకి కారు పార్టీలో కలవరం మొదలైందా? రాజకీయ ప్రత్యర్థి అలాంటి స్టెప్ తీసుకుంటారని గులాబీ పెద్దలు అస్సలు ఊహించలేకపోయారా? ముందు ఉలిక్కిపడి షాకైనా… వెంటనే విరుగుడు మంత్రం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయా? కాంగ్రెస్ ప్రయోగించిన ఆ అస్త్రం ఏంటి? బీఆర్‌ఎస్ ఎలా కౌంటర్ చేసుకోవాలనుకుంటోంది?
తెలంగాణలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. దాంతో ఎత్తులకు పై ఎత్తులతో పొలిటికల్ గేమ్ మాంఛి రసవత్తరంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ విసిరిన ఓ గూగ్లీ దెబ్బకు ప్రతిపక్షం బీఆర్‌ఎస్ డిఫెన్స్‌లో పడిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయట పొలిటికల్ సర్కిల్స్‌లో. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల ఓట్లు చాలా కీలకం. దాదాపు లక్షా 30వేల వరకు ఉన్నాయి. ఆ ఓట్ బ్యాంక్ టార్గెట్‌గానా అన్నట్టు మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ప్రకటించింది కాంగ్రెస్.
Off The Record: జూబ్లీహిల్స్ జంబో బ్యాలెట్ ఎవరి కొంప ముంచబోతుంది?
గత ఎన్నికల్లో ఇదే సీట్లో పోటీ చేసి ఓడిపోయిన అజార్‌కు ఇటీవలే ఎమ్మెల్సీ ప్రకటించింది. దాంతోపాటు ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి కూడా సిద్ధమైంది. ఈ నిర్ణయమే బీఆర్‌ఎస్‌ని ఆత్మరక్షణలో పడేంసిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయట. ముస్లిం ఓట్ల కోసం ఇప్పటివరకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది గులాబీ పార్టీ. ప్రస్తుతం ఎంఐఎం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నందున పతంగి పార్టీ వ్యతిరేక ముస్లింలను బుట్టలో వేసుకుని చీలిక తెచ్చేందుకు నానా తంటాలు పడుతోంది.మరోవైపు కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్‌కి ప్రకటించిన ఎమ్మెల్సీ చెల్లదని, అలాంటి పదవి ఇచ్చి ముస్లిం ఓటర్లను మభ్యపెడుతోందని పదేపదే మీటింగ్స్‌లో చెబుతున్నారు కేటీఆర్.
కానీ…ఇప్పుడు అదే అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో… ఉలిక్కిపడ్డ కారు పార్టీ పెద్దలు ఇప్పుడు ప్రత్యామ్నాయాలకు పదును పెడుతున్నట్టు తెలుస్తోంది. అంతకు ముందు ఎన్నికలప్పుడు బీఆర్‌ఎస్‌కు ఎంఐఎం సపోర్ట్ పుష్కలంగా ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్దలు సూచించినట్టుగా జూబ్లీహిల్స్‌లో మైనార్టీ అభ్యర్థిని నిలబెట్టిన ఎంఐఎం ఆ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడకుండా… చీల్చిందన్న ఆరోపణలున్నాయి. అదే ఎంఐఎం ఇప్పుడు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తోంది. ఇలా పతంగి పార్టీ అటు మొగ్గడం, అదే సమయంలో కాంగ్రెస్ కూడా గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మైనార్టీలు గంపగుత్తగా అటువైపు తిరుగుతారేమోనని చర్చ జరుగుతోందట బీఆర్‌ఎస్‌లో. అందుకే…. వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించినట్టు తెలిసింది.
Snapdragon 8 Elite చిప్, 7500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ తో iQOO Neo11 లాంచ్..!
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని సర్వేలు సూచిస్తున్నాయని, ఆ విషయం తెలిసే…కాంగ్రెస్ పెద్దలు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు తప్ప అది మైనార్టీ మీద ప్రేమ కాదన్న ప్రచారం మొదలుపెట్టారట గులాబీ నాయకులు. అలాగే… ఎంఐఎం అధిష్టానం కాంగ్రెస్ వైపు ఉన్నప్పటికీ దిగువ స్థాయి కేడర్‌ని తమ వైపు తిప్పుకునే పనిలో ఉన్నట్టు సమాచారం. అలాగే.. ముస్లిం మత పెద్దలతో కూడా పెద్ద ఎత్తున తమ తరఫున ప్రచారం చేయించడానికి ప్లాన్ చేస్తోందట. అలాగే… గతంలో అజారుద్దీన్ మైనార్టీలకు ఏమీ చేయలేదన్న ప్రచారాన్ని కూడా మొదలు పెట్టింది కారు పార్టీ. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి దాకా మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు, ఇప్పుడెందుకు ఇస్తున్నారో అర్ధం చేసుకోమని కూడా ప్రచారం చేయబోతున్నారట.
అలాగే అజారుద్దీన్‌కు ఇవ్వాలనుకున్న ఎమ్మెల్సీ పదవి కూడా కోర్ట్ కేసుల్లో ఉందని వివరించబోతున్నట్టు తెలిసింది. ఇలా ఎన్నికల వేళ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ జూబ్లీహిల్స్ బైపోల్‌ను రక్తి కట్టిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తారని బీఆర్‌ఎస్ అధిష్టానం కూడా ఊహించలేకపోయిందట. అందుకే నెగెటివ్ ప్రచారానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అలా… ఓవరాల్‌గా జూబ్లీహిల్స్ పొలిటికల్ డ్రామాలో రకరకాల ట్విస్ట్‌లు పెరుగుతున్నాయి.