Itlu Arjuna : ఎన్టీఆర్‌ను ఫిదా చేసిన కొత్త హీరో: ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ సంచలనం!

Itlu Arjuna Trailer

Itlu Arjuna Trailer

 తొలి సినిమాలోనే హీరోలు మాస్ డైలాగులు చెప్పాలని ఆరాటపడతారు. కానీ, ఒక్క మాట కూడా మాట్లాడకుండా, మూగవాడి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావాలంటే ఎంతో గట్స్ ఉండాలి. సరిగ్గా ఇలాంటి సాహసమే చేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను సైతం ఫిదా చేశాడు ఓ కొత్త హీరో. కింగ్ నాగార్జున సమర్పణలో, మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఇట్లు అర్జున’. ఈ చిత్రంతో అనీష్ అనే యువకుడు టాలీవుడ్‌కు హీరోగా పరిచయమవుతున్నాడు. వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల నిర్మిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా ఎన్టీఆర్ విడుదల చేసి, చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. “డెబ్యూ సినిమాకే ఒక్క డైలాగ్ లేని పాత్రను ఎంచుకుని అందరి దృష్టిని ఆకర్షించడం అనీష్ రియల్ గట్స్‌కు నిదర్శనం. కథపై నీకు ఎంత నమ్మకం ఉందో దీన్నిబట్టే అర్థమవుతోంది. నీకు అద్భుతమైన ఆరంభం లభించాలి బ్రదర్” అంటూ తారక్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. కేవలం రొమాన్స్, కామెడీకి పరిమితం కాకుండా ఒక మైండ్ బ్లాంక్ అయ్యే మిస్టరీని ఇందులో చూపించారు. ఓ మిస్టీరియస్ పెన్‌డ్రైవ్, ఏకంగా రూ.1,000 కోట్ల భారీ డీల్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని ట్రైలర్ స్పష్టం చేసింది. పోలీసుల వేటలో ఉన్న ఓ దొంగ కేసులోకి మూగ యువకుడైన అర్జున్ (అనీష్) ఎంటర్ అవుతాడు. మాటలు రాకపోయినా అసాధారణ తెలివితేటలున్న అర్జున్, కీర్తి (అనస్వర రాజన్)తో పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. అయితే అనూహ్యంగా ఈ జంట ప్రాణాపాయంలో చిక్కుకుంటుంది. ఒకవైపు పోలీసులు, మరోవైపు గూండాల ముఠా వీరిని ఎందుకు వెంబడిస్తున్నారు? ఆ వెయ్యి కోట్ల డీల్‌కు, మూగవాడైన హీరోకు సంబంధం ఏంటి? అనేది డైరెక్టర్ మహేష్ ఉప్పల చాలా సస్పెన్స్‌గా ఉంచారు.

మాటలు లేకుండా కేవలం హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌తోనే ఒక ఛాలెంజింగ్ పాత్రలో అనీష్ అద్భుతంగా ఒదిగిపోయాడు. యాక్షన్, ఛేజింగ్ సీన్లలో కొత్త హీరోలా కాకుండా ఎంతో ఈజ్‌తో నటించి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఇక అనస్వర రాజన్ తన క్యూట్ అండ్ చార్మింగ్ పెర్ఫార్మెన్స్‌తో, బలమైన భావోద్వేగాలతో ఆకట్టుకుంది. రాజా మహదేవన్ అందించిన విజువల్స్, ముఖ్యంగా రొమాంటిక్, ఇంటెన్స్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. దానికి తోడు సంగీత దర్శకుడు ఎస్. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. భారీ నిర్మాణ విలువలతో, రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్ కలగలిపిన ఒక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న థియేటర్లలోకి అడుగుపెడుతోంది. ట్రైలర్‌తోనే బజ్ క్రియేట్ చేసిన ఈ వెయ్యి కోట్ల మిస్టరీ.. వెండితెరపై ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో చూడాలి. YouTube video player