వరంగల్ నగరంలో మహా శివరాత్రి పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ములుగు రోడ్డులోని పైడిపల్లి వద్ద ఉన్న వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న రేష్మిత (20) ఆత్మహత్య చేసుకుంది. రేష్మిత ఈరోజు ఉదయం నుంచి రూములో నుండి బయటకు రాకపోవడంతో కాలేజి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చింది. రేష్మిత ఉంటున్న గది వెంటిలేటర్ నుండి పరిశీలించిన పోలీసులు.. ఆమె ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
నల్లగొండ జిల్లాలో ఉంటున్న రేష్మిత కుటుంబ సభ్యులకు పోలీసులు, కాలేజీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. తాము వచ్చే వరకు గది తలుపులు తెరవద్దని పోలీసులను కుటుంబ సభ్యులు కోరారు. కుటుంబ సభ్యుల సూచన సూచన మేరకు పోలీసులు గది తలుపులు తెరవలేదు. ఏనుమాముల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు వ్యక్తిగత కారణమని తెలుస్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఈ వ్యవసాయ కళాశాల నిర్వహిస్తున్నారు.