Raghunathpally birthday party stabbing: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. బర్త్ డే పార్టీ వేడుకల్లో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. ఎంగిలి గ్లాసులో తనకు మద్యం పోస్తారా? అంటూ ఇద్దరి స్నేహితులపై మరో స్నేహితుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో కత్తి పోట్లకు గురైన ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న రఘునాథపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. కత్తితో విచక్షణారహితంగా పొడిచిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
మంగళవారం రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామంకు చెందిన చెరుకు వెంకటేష్, మల్లా మధుల బర్త్ డే. గ్రామ శివారులోని ఓ ప్రజాప్రతినిధికి చెందిన మామిడి తోటలో బర్త్ డే బాయ్స్ ఇద్దరు కలిసి తమ స్నేహితులకు భారీ ఎత్తున పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి కూరపాటి రాజశేఖర్ కూడా వచ్చాడు. అతడి కూడా స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. కాసేపటికి తనకు ఎంగిలి గ్లాసులో మద్యం పోశారంటూ చెరుకు వెంకటేష్, కీర్తి వెంకటేష్‌లతో రాజశేఖర్ వాగ్వాదంకు దిగాడు. దీంతో ముగ్గురి మధ్య ఘర్షణ జరిగింది. చెరుకు వెంకటేష్, కీర్తి వెంకటేష్‌లు తోట నుండి వెల్ది గ్రామానికి చేరుకుని రాజశేఖర్ తండ్రికి గొడవపై ఫిర్యాదు చేశారు.
Also Read: Ravi Shastri: ఆల్‌టైమ్ గ్రేట్ టాప్-5 ఇండియా క్రికెటర్లు.. ద్రవిడ్, గంగూలీ, కుంబ్లేకు నో ప్లేస్!
ఇంట్లో తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ కూరపాటి రాజశేఖర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. మద్యం మత్తులో ఉన్న రాజశేఖర్ ముందుగా చెరుకు వెంకటేష్‌పై కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన కీర్తి వెంకేష్‌ను సైతం గాయపరిచాడు. అక్కడున్న వారు రాజశేఖర్‌ను అదుపు చేశారు. చెరుకు వెంకటేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో.. హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం అతడు శ్రీకర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కీర్తి వెంకేష్‌కు జనగామ జిల్లా ఆస్పత్రిలో చికిత్స జరిగింది. చెరుకు వెంకటేష్ పరిస్థితి ఇప్పుడు మెరుగైందని సమాచారం. ప్రస్తుతం రాజశేఖర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.