జనగామ నియోజకవర్గంలోని ఎర్రగుంటతండాలో ఆదివారం బీఆర్ఎస్ కార్యకర్తలపై జరిగిన దాడిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఖండించారు. ఈరోజు జరిగిన అరాచకం నిజాంపాలనలో కూడా జరగలేదని పల్లా మండిపడ్డారు. పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోమని, మలి దశ ఉద్యమ సమయంలో పోరాడిన గడ్డ జనగామ అని మర్చిపోవద్దని హెచ్చరించారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రారంభించిన 4 పథకాలను పేదలందరికీ అందించాలని కోరిన ఎమ్మెల్యే పల్లా, కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కోడిగుడ్లు, టమాటలతో దాడి చేశారు.
దాడి అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… ‘ఎర్రకుంట తండాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 పథకాల ప్రారంభోత్సవ సభ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను అక్రమ హౌస్ అరెస్టు చేశారు. జనగామ మండలం నుండి కాకుండా వేరే మండలాల నుండి కాంగ్రెస్ శ్రేణులను తీసుకోచ్చి మాపై దాడి చేశారు. మా పార్టీ సర్పంచ్, వార్డు సభ్యులను అక్రమ అరెస్టు చేశారు. పోలీసులు మా కార్యకర్తలను ఇష్టం వచ్చినట్టు కొట్టారు. పథకాలను అందరికీ అందేలా మా హయాంలో మేము పని చేశాం. పోలీసులకు మేము సహకరించినం. స్థానిక సీఐ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాటలు పెట్టించి కాంగ్రెస్ కార్యకర్తలతో డ్యాన్సులు చేయించాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవరించిన సీఐపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, సీపీని డిమాండ్ చేస్తున్నా’ అని అన్నారు.
Also Read: Foreign Ganja గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం.. గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్!
‘ఈరోజు జరిగిన అరాచకం నిజాంపాలనలో కూడా జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలి. ఎర్రకుంటలో 300 ఉంటే 40 మందికి మాత్రమే పథకాలు ఇస్తున్నారు. గ్రామంలో ఉన్న అర్హులైన అందరికీ పథకాలను ఇవ్వాలి. రిపోర్టర్‌పై దాడి చేసిన వారే మళ్ళీ పరామర్శకు వచ్చారు. ప్రభుత్వం రెండు వేల పెన్షన్ హామీని నాలుగు వేలు ఇవ్వాలి. మా వారిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోము. మలి దశ ఉద్యమ సమయంలో పోరాడిన గడ్డ జనగామ అని మర్చిపోవద్దు’ అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.