మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారంలో వేడిపెరుగుతోంది. ఇప్పటికే మునుగోడులో ఏ వాడ చూసినా ఏదో ఒక పార్టీకి చెందిన నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి రంగంలోకి దిగారు. ఆయన ఆరోజు మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలంలో పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువలను గాలికి వదిలేసాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రచారాన్ని అడ్డుకోవడం సరికాదు.. తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Also Read : Kishan Reddy: సూట్ కేసు నిండా డబ్బులు.. లారీల కొద్దీ బీర్లు
అడ్డుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉప ఎన్నికల సందర్భంగా అనుసరిస్తున్న విధానాలు ఈ సమాజానికి హాని కలిగిస్తాయన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నెలకొన్న తాజా పరిస్థితిలపై ప్రజాస్వామ్యవాదులు నోరుతెరవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఓటర్లు నడుము కట్టాల్సిన అవసరం ఉందని, డబ్బు, అధికారంతో వచ్చేవారికి పట్టం కడితే ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.