MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Mp Uday Srinivas

Mp Uday Srinivas

MP Uday Srinivas: కాకినాడలో జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన.. జనసేన అధికారంలోకి వచ్చిన రోజే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. కాపు సీఎం అంశాన్ని భావోద్వేగ అంశంగా అభివర్ణించిన ఆయన, వైసీపీ నేతలు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జనసేన కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం కల్పించిందని పేర్కొన్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పార్టీ 48 శాతం సీట్లు కాపులకు కేటాయించిందన్నారు. ప్రస్తుతం జనసేన తరఫున ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు కాపు సామాజిక వర్గానికి చెందినవారేనని చెప్పారు.

అదే సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేవలం 12 శాతం సీట్లు మాత్రమే కాపులకు ఇచ్చిందని ఆరోపించారు ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్… కాపు సీఎం కావాలనే అంశంపై వైసీపీ కాపు నేతలు మాట్లాడే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేసిన ఆయన, కుల రాజకీయాలకు పాల్పడొద్దని హితవు పలికారు. అయితే, జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కానీ, రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ కులప్రస్తావన కొనసాగుతూనే ఉంది.. పార్టీ అధినేతలు.. ప్రజా ప్రతినిధులు.. నేతలు.. ఇలా ఎవరు మాట్లాడినా.. ఏదో ఒక సమయంలో కులం పేరు.. దాని ప్రస్తావన తేకుండా ముందుకు సాగరు..