Jamuna Tudu: ‘జమున టుడూ’ ఒడిశాలోని రాయిరంగపుర్ గ్రామంలో పచ్చదనం, పొలాల మధ్య పెరిగిన ఓ పేదింటి మహిళా. పెళ్ళైన తరువాత, ఆమె తన భర్తతో కలిసి ఝార్ఖండ్‌లోని మాతుకంకి గ్రామానికి వచ్చింది. అలా వచ్చిన ఆమెకు తన ఇంటి చుట్టూ ఉన్న అనేక చెట్లు నరికిన వాతావరణాన్ని గమనించారు. అవసరాల కోసం స్థానికులు, అలాగే కొందరు తమ స్వార్థం కోసం చెట్లను నరికే స్మగ్లర్లను చూసి ఆమె ఆందోళనకు చెందింది. చెట్లు నరికితే మనకు మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా ఆపద అని గుర్తించి ఆమె అడవి కాపాడాలని బలంగా నిర్ణయించుకుంది.
ఈ అంశానికి సంబంధించి ప్రారంభంలో జమునకు తన కుటుంబ సభ్యుల సహాయం కూడా లభించలేదు. అయినా, ఆమె ఒక మంచి సంకల్పంతో అడవి రక్షణ కోసం పోరాడింది. ఆ సమయంలో ఆమెను అనుసరించిన మహిళలు కూడా చాలా తక్కువే. కానీ, క్రమంగా అయిదుగురు మహిళలు ఆమెకు తోడుగా నిలిచారు. ఆ తర్వాత కొందరితో కలిసి “వన సురక్ష సమితి”గా మారింది. ఈ సమితి సభ్యులు అడవిని కాపాడేందుకు బాణాలు, కర్రలు, కత్తులను చేత బట్టారు.
Read Also: IPL 2025 RCB: ‘ఈ సాల కప్ నమ్మదే’.. కొత్త కెప్టెన్ ఆర్‌సిబి తల రాతను మార్చగలడా!
ఇలా అడవిని కాపాడే క్రమంలో నక్సల్స్, మాఫియా లతో బెదిరింపులు.. ఇతర అడ్డంకులను ఎన్నో ఎదుర్కొంది. ఒకానొక సమయంలో ఆమె చావు అంచుల వరకు కూడా వెళ్లి వచ్చింది. కానీ, ఆమె పోరాటం మాతరం ఆగలేదు. జమున ఈ పోరాటం మొదలు పెట్టే సమయానికి ఈమెకు కేవలం 18 ఏళ్ళు మాత్రమే. నిజానికి జమున సాహసంతో అడవికి రక్షణ దొరికిందని చెప్పవచ్చు.
ఇలా ఈ పోరాటం కేవలం ఆమె ఊరే కాకుండా, పక్క ఊళ్లలో కూడా విస్తరించింది. ఆమె పోరాటం పది వేల మందిని ప్రభావితం చేసిందంటే ఆమె సంకల్పం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 50 హెక్టార్ల అడవిని కాపాడారు. పర్యావరణ రక్షణ కోసం ఆమె చేసిన కృషి, ఆమె ధైర్యం, ఆమె సంకల్పం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రశంసలు పొందాయి. ఆమెకు పద్మశ్రీ సహా అనేక అవార్డులు కూడా దక్కాయి. ఇందులో భాగంగానే జమున టుడూకి ‘లేడీ టార్జాన్ ఆఫ్ ఇండియా’ అనే బిరుదుని దేశం ఇచ్చింది. ఆమె సాధించిన విజయాలు పర్యావరణ రక్షణకు మాత్రమే కాకుండా.. మహిళల శక్తిని, దృఢ సంకల్పాన్ని చూపించే చిహ్నంగా నిలిచాయి.