Jaipur: రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని పాత్రకార్ కాలనీలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఒక లగ్జరీ కారు నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్న ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఖరాబాస్ సర్కిల్ వద్ద జరిగింది. ముందుగా రోడ్డు మధ్య డివైడర్‌ను ఢీకొట్టిన కారు అదుపు తప్పి దాదాపు 30 మీటర్ల దూరం వరకు రోడ్డుపక్కన ఉన్న స్టాళ్లు, ఆహార బండ్లను ఢీకొట్టింది. ఈ క్రమంలో అక్కడ నిలిపి ఉన్న వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
READ MORE: Telangana : పండుగ వేళ.. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ‘కోటి’ భరోసా..!
కారులో నలుగురు ఉన్నారని, వారు మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మిగతా వారు పరారయ్యారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారందరినీ మొదట జైపూరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఎనిమిది మందిని అక్కడే చేర్చగా, కొందరిని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. భిల్వారా జిల్లాకు చెందిన రమేష్ బైరవా అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నలుగురిని సవాయి మాన్ సింగ్ (SMS) ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ప్రేమ్‌చంద్ బైరవా, ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్ ఖింసార్ జైపూరియా ఆస్పత్రిని సందర్శించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
READ MORE: Off The Record: మంత్రి పదవి కోసం కోటంరెడ్డి కొత్త డ్రామా మొదలుపెట్టారా?