Drunk Man Dial 100: మద్యం మత్తులో చాలా మంది మందుబాబులు సామాన్యుల్లా ప్రవర్తించరు. ప్రజల సౌలభ్యం కోసం డయల్ 100 నంబర్ ఉందని తెలిసిందే. ఇది ఎమర్జెన్సీ నంబర్. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే అధికారులు వెంటనే వచ్చి వారిని ఆదుకుంటారు. అలాంటి గొప్ప సర్వీసుకు ఫోన్ చేసి కొంత మంది ఆటలాడుతూ ఉంటారు. అయితే తాజాగా తెలంగాణకు చెందిన ఓ మందుబాబు ఎమర్జెన్సీ నంబర్‌కు పలు మార్లు ఫోన్ చేశాడు. మద్యం మత్తులో డయల్ 100కి పలుమార్లు ఫోన్ చేసి పోలీసులను విసుగెత్తించాడు.
Read Also: Liquor Bottles: దొంగిలించిన మద్యం పంపకం విషయంలో గొడవ.. స్నేహితుడి దారుణ హత్య
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రామ్‌రెడ్డిపల్లె గ్రామానికి చెందిన శివరాత్రి లక్ష్మణ్ తాగిన మత్తులో అకారణగా డయల్ 100కు చాలా సార్లు ఫోన్ చేశాడు. ఈ క్రమంలోనే పలుమార్లు ఫోన్ చేస్తూ పోలీసుల సమయాన్ని వృథా చేసినందుకు పోలీసులు న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. అతడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. రెండు రోజులు జైలు శిక్ష విధించారు. మరో సారి డయల్ 100కు ఫోన్ చేసి విసిగించవద్దని న్యాయమూర్తి హెచ్చరించారు.