తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్థాపం చెందిన ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో సోమవారం చోటుచేసుకుంది. రైతు మరణంతో కిష్టంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్దదిక్కు మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
Also Read: Phone Tapping Case: అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు ఊరట!
వివరాల ప్రకారం… పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి ఓ రైతు. నిరుపేద అయిన ప్రభాకర్ గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ కొరకు అర్జీ పెట్టుకున్నాడు. అప్పుడు ఇళ్లు రాలేదని.. ప్రజాపాలనలో సైతం అర్జీ పెట్టుకున్నాడు. ఈనెల 22వ తేదీన జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా కొరకు మరలా అర్జీ పెట్టుకోగా.. తన పేరు రాలేదు. ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్థాపం చెందిన ప్రభాకర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రభాకర్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ వారు వేడుకుంటున్నారు.