ఇజ్రాయెల్ అంతిమ యుద్ధం చేస్తామంటోంది. ఇరాన్ ఇజ్రాయెల్ ను తుడిచిపెడతామంటోంది. ఏకంగా అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దళానికి, ఇరాన్ క్షిపణుల సామర్థ్యానికి మధ్య నేరుగా పోరు జరుగుతోంది. రెండువైపులా జరుగుతున్న నష్టం తీవ్రంగానే ఉందనే అంచనాలున్నాయి. యుద్ధం కొనసాగితే.. ఇరాన్ తో పాటు ఇజ్రాయెల్ కు ఆర్థిక కష్టాలు తప్పేలా లేవు.
ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణతో తల్లడిల్లుతున్న ప్రపంచానికి.. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అనుకోని యుద్ధం కొత్త షాక్ ఇచ్చింది. హమాస్ మీద క్రమంగా దాడుల తీవ్రత పెంచిన ఇజ్రాయెల్.. ఇరాన్ విషయంలో ఆ పని చేయలేదు. తొలి దాడే భయంకరంగా చేసింది. రెండోరోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమారుస్తామని ఇజ్రాయెల్ ప్రతిపాదన పెడితే.. ట్రంప్ అడ్డుకున్నారనే వాదన కూడా వినిపించింది. ఏకంగా టెహ్రాన్ ను ఖాళీ చేయాలని ఇరాన్ పౌరుల్ని హెచ్చరించిన ఇజ్రాయెల్ నిరంతరాయంగా ఇరాన్ రాజధానిపై విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో స్వైరవిహారం చేస్తున్నాయి. మొదట ఇరాన్ అణుకేంద్రాల్ని గురి పెట్టిన ఇజ్రాయెల్.. వెంటనే ఇంధన లక్ష్యాలపై దాడులు చేయడం.. ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దీంతో ముస్లిం దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి.
ఇటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడులకు దీటుగా బదులిస్తోంది. ఏకంగా 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ పై వరుసగా క్షిపణి దాడులు చేస్తూ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్ కు భారీ నష్టం జరిగినా.. ఆ దేశం పూర్తి వివరాలు చెప్పడం లేదనే ఆరోపణలున్నాయి. ఏకంగా మొసాద్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడులు చేయడం ఇజ్రాయెల్ కు కూడా షాకిచ్చిన పరిణామమే. అత్యాధునిక యుద్ధ విమానాలతో ఇరాన్ అంతు చూద్దామనుకున్న ఇజ్రాయెల్ కు.. ఊహించని స్థాయిలో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఇరాన్ దగ్గర ఇంత శక్తివంతమైన ఖండాంతర క్షిపణులున్నాయని ఇప్పటిదాకా ఎవరూ అనుకోలేదు. కానీ ఇజ్రాయెల్ కు దీటుగా విజృంభిస్తున్న ఇరాన్ క్షిపణులు.. నిర్దేశిత లక్ష్యాలను నేలమట్టం చేస్తున్నాయి. ఆరు రోజులకే అత్యంత తీవ్ర స్థాయికి చేరుకున్న ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం.. రాబోయే రోజుల్లో మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్, ఇరాన్.. రెండు దేశాలకూ పురాతన నాగరికతలున్నాయి. అయితే, ఇజ్రాయెల్, ఇరాన్ ఇరుగు పొరుగు దేశాలు కాదు. రెండు దేశాల మధ్య వేల కిలోమీటర్లు దూరం ఉంది. కానీ వైరమే ఆ రెండు దేశాలనూ దగ్గర చేస్తోంది. సాధారణంగా, ప్రపంచంలో ఏ దేశాల మధ్య జరిగే యుద్ధాలైనా ఆ దేశాలకు సంబంధించిన భూమి కోసం ప్రారంభమవుతాయి. కానీ, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మాత్రం మతం కారణంగా శత్రుత్వ భావన మొదలైంది. ఇప్పుడు కూడా అణ్వాయుధాలు సాకు మాత్రమేననే అభిప్రాయం లేకపోలేదు.
ముస్లింలతో పోరాడుతున్న ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తామని ఇరాన్ ఎప్పట్నుంచో బహిరంగంగా హెచ్చరిస్తోంది. ఇరాన్ లో విస్తారమైన చమురు వనరులు ఉన్నాయి. ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి చమురు వనరుల ద్వారా భారీగా లభించే డబ్బును అది ఉపయోగిస్తోంది. ఇజ్రాయెల్పై జరిగిన అన్ని యుద్ధాలలోనూ అరబ్ దేశాలు ఓటమిపాలయ్యాయి. అయితే, ప్రస్తుతం ఆ దేశాలు ఇజ్రాయెల్పై తమ వ్యతిరేకతను తగ్గించాయి. కానీ, ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్పై పోరాటానికి నాయకత్వం వహించి ఇజ్రాయెల్‌కు అతిపెద్ద శత్రువుగా మారింది. ఇరాన్ వద్ద ఇప్పటికే అణుబాంబులు ఉన్నాయని ఇజ్రాయెల్‌తోపాటు అగ్రరాజ్యం అమెరికా కూడా అనుమానిస్తోంది.
ఇరాన్ అణుబాంబులను కొనుగోలు చేస్తుందని, ఇజ్రాయెల్‌పై దాడిచేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ గత 20 సంవత్సరాలుగా హెచ్చరిస్తోంది. ఏడాదిన్నర పైగా హమాస్ తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్.. ఉన్నట్టుండి ఇరాన్ పై దాడులు చేసి.. కొత్త చిచ్చుకు కారణమైంది. అకస్మాత్తుగా ఈ నెల13న ఇజ్రాయెల్ ఊహించని రీతిలో ఇరాన్‌పై భీకర దాడిని ప్రారంభించింది. అమెరికాతో చర్చలు జరుగుతున్నందున ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడిని ఊహించలేకపోయింది. ఇజ్రాయెల్‌ను అంచనా వేయడంలో ఇరాన్ ఘోరంగా విఫలమైంది. ఇజ్రాయెల్ ఆకస్మిక దాడిచేసి ఇరాన్‌కు చెందిన టాప్ జనరల్స్, వైమానికదళ అధిపతి, రక్షణమంత్రి, అగ్రస్థాయి అణుశాస్త్రవేత్తలు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి దగ్గరగా ఉన్న జనరల్స్‌ను చంపింది.
ఇరాన్ జనరల్స్ కూడా ఇజ్రాయెల్ దాడిని ఊహించకపోవడంతో తమ ప్రాణాలను కోల్పోయారు. ఇజ్రాయెల్ ఆకస్మిక దాడి చాలా విధ్వంసం సృష్టించింది. ఇరాన్ వైమానిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలు, క్షిపణులను నిల్వ చేసిన ఇతర సైనిక స్థావరాలను కూడా ఇజ్రాయెల్ నాశనం చేసింది. యుద్ధాలు ఎలా ముగుస్తాయో ఎవరూ ఊహించలేరు. ఇజ్రాయెల్ తన లక్ష్యాలలో కొన్నింటిని అయినా సాధించకుండా యుద్ధాన్ని ఆపదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి సంబంధించి తమ నిర్ణయం గురించి అమెరికా ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టం చేయలేదు. ప్రస్తుతానికి అమెరికా మధ్యప్రాచ్యంలో తన యుద్ధ విమానాలను మోహరిస్తోంది. అలాగే యూకే కూడా మిలటరీ బలగాల్ని తరలిస్తోంది. ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్ కు మద్దతుగా రంగంలోకి దిగుతాయనేది బహిరంగ రహస్యమే. ఇప్పటికే మూడో దేశం జోక్యం చేసుకుంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. మధ్యప్రాచ్యంలో అమెరికా స్థావరాల్ని కార్నర్ చేసే ప్లాన్ కూడా రెడీగా ఉంచిందని చెబుతున్నారు. అమెరికా ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేది.. ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ గమనాన్ని నిర్దేశించనుంది.
ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంతో పశ్చిమాసియా దేశాల్లో ఎయిర్ పోర్టులు మూసివేస్తున్నారు. వేలాది మంది ఎయిర్ పోర్టుల్లో చిక్కుపోయారు. ఇరాక్, ఇరాన్, జోర్డాన్, లెబనాన్ ఎయిర్ పోర్టులను మూసివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సు నుంచి మధ్యలోనే అమెరికా తిరిగొచ్చారు. ఇరాన్ పై దాడి ముమ్మరం కానుందని అందుకే అమెరికా అధ్యక్షుడు తిరిగొచ్చారని ప్రచారం జరుగుతోంది.
ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాలు చేస్తూ శాంతి చర్చలు అంటే కుదరదని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ లో కీలక సమావేశం పెట్టడం కీలక పరిణామం. చాలా కీలక సమయాల్లోనే అమెరికా అధ్యక్షులు సిచ్యువేషన్ రూమ్ కు వెళుతుంటారు. దీంతో ఇరాన్ పై అమెరికా కూడా దాడులకు పాల్పడే అవకాశం పెరిగినట్టు కనిపిస్తోంది. ఇరాన్ పై ఏకకాలంలో దాడులకు దిగి అణు ప్లాంట్ లను ధ్వంసం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
అటు ఇజ్రాయెల్ అనేక వైపుల నుంచి యుద్ధాలు చేస్తూ ఆర్థికంగా కుదేలవుతోంది. దాదాపు ఏడాదిన్నరకు పైగా సాగుతున్న గాజా యుద్ధం, ఇటీవల ఇరాన్‌తో ప్రారంభమైన వార్ వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. సైనిక ఖర్చులు పెరిగిపోవడంతో పాటు సాధారణ వ్యయాలు కూడా పెరిగాయి. రిజర్వ్ సైనికులను మెయింటేన్ చేయడం కూడా ప్రభుత్వానికి పెను భారంగా మారింది. ఈ యుద్ధాల వల్ల ఇజ్రాయెల్ భవిష్యత్తులో ఆర్థికంగా మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.ఇటీవల ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో మొదటి 48 గంటల్లోనే ఇజ్రాయెల్ 1.45 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింద. ప్రస్తుతం ఇజ్రాయెల్.. రక్షణ కోసం చేసే ఖర్చు దేశ డీజీపీలో 7 శాతానికి చేరుకుంది. యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఇజ్రాయెల్‌కు ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా, యూకే రంగంలోకి దిగితే.. ఇరాన్ కు మద్దతుగా ఎవరొస్తారనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి కొన్ని సాయుధ గ్రూపుల మద్దతున్న ఇరాన్ .. వారితో కలిసి వ్యూహాన్ని రచిస్తోంది. కానీ కొన్ని ముస్లిం దేశాలైనా ఇరాన్ పక్షాన యుద్ధం చేస్తే మాత్రం.. అప్పుడు ఎవరి ఊహకూ అందని పరిణామాలు జరుగుతాయనే వాదన వినిపిస్తోంది.