ఐపీఎల్ 2025 వేలానికి ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల సంఖ్యను నాలుగు నుంచి ఐదుకు పెంచింది. రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఎంపిక ద్వారా మరో ఆటగాడిని అనుమతించింది. మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ప్రతి ప్రాంచైజీకి అవకాశం ఇచ్చింది. టీమ్ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచింది. వచ్చే సీజన్ నుంచి ప్రతి లీగ్ మ్యాచ్ ఆడిన ఆటగాడికి రూ.7.50 లక్షల మ్యాచ్ ఫీజును నిర్ణయించారు. అలానే బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: IPL Auction 2025: ఆరుగురిని రిటైన్ చేసుకోవచ్చు.. విదేశీ ప్లేయర్లకు నో లిమిట్! ఫుల్ డీటెయిల్స్ ఇవే
జోఫ్రా ఆర్చర్, మిచెల్ స్టార్క్ వంటి ప్లేయర్స్ జట్టు కొనుక్కున్నాక సీజన్ ఆరంభానికి ముందు తాను అందుబాటులో ఉండనని చెప్పారు. దాంతో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చాలా ఇబ్బంది పడ్డాయి. గాయం కారణంగా వీరిద్దరూ జట్టుకు దూరమవ్వలేదు. ఐసీసీ టోర్నీలు ఆడేందుకు ఐపీఎల్ నుంచి తపుకున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా.. ఐపీఎల్ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు కొనుక్కున్నాక సీజన్ ఆరంభానికి ముందు తాను అందుబాటులో ఉండనని చెబితే.. సదరు ఆటగాడిని రెండేళ్లు లీగ్ నుంచి నిషేధించాలని నిర్ణయించింది. నవంబరులో ఐపీఎల్ 2025 వేలం జరిగే జరిగే అవకాశముంది.