ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలో 1,574 మంది ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. 16 విదేశాలకు చెందిన ఆటగాళ్లు వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మొత్తం 409 విదేశీ ప్లేయర్స్ వేలంలో అందుబాటులో ఉన్నారు. జోస్ బట్లర్, మిచెల్ స్టార్క్, జోఫ్రా ఆర్చర్, నాథన్ లైయన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి విదేశీ స్టార్ ప్లేయర్స్‌పై అందరి దృష్టి ఉంది. మరో విదేశీ ఆటగాడు కూడా హైలెట్‌గా నిలవనున్నాడు. అతడే 24 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ థామస్ జాక్ డ్రాకా.
ఐపీఎల్ 2025 వేలంలో థామస్ డ్రాకా తన పేరును నమోదు చేసుకున్నాడు. రూ.30 లక్షల కనీస ధరతో పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. దాంతో ఐపీఎల్ వేలంలో అడుగుపెట్టనున్న మొట్టమొదటి ఇటలీ ఆటగాడిగా థామస్ నిలిచాడు. ఈ ఏడాదే అరంగేట్రం చేసిన థామస్ ఇప్పటివరకూ 4 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. గత ఆగస్టులో కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20 లీగ్‌లో చెలరేగాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో 10.63 సగటు, 6.88 స్ట్రైక్‌రేట్‌తో 11 వికెట్లు తీశాడు. ఇక యూఏఈలో జరిగే ఐఎల్‌టీ20 కోసం ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ ఎమిరేట్స్ అతనితో ఒప్పందం చేసుకుంది. ఐపీఎల్‌లో కూడా అతడికి మంచి ధర పలికే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా తరపున రాణించిన భారత సంతతి పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ కూడా ఐపీఎల్ 2025 వేలం కోసం పేరు నమోదు చేసుకున్నాడు. సౌరభ్ రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వస్తున్నాడు. ప్రపంచకప్ 2024లో సౌరభ్ టాప్ బ్యాటర్లను వణికించిన విషయం తెలిసిందే. మనోడికి కూడా భారీ ధర దక్కే అవకాశాలు ఉన్నాయి. 42 ఏళ్ల వెటరన్ ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ తొలిసారి ఐపీఎల్ వేలంలో దిగబోతున్నాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతను చివరగా 2014లో టీ20 మ్యాచ్ ఆడాడు. ఈ వయసులో కూడా తన స్వింగ్‌తో మేటి బ్యాటర్లకు సైతం చుక్కలు చూపించాడు.