Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు ఇటీవల అంతర్రాష్ట్ర వ్యభిచార ముఠాను ఛేదించారు. 10 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల నలుగురు మైనర్ బాలికలను రక్షించారు. ఈ మేరకు ఓ సీనియర్ పోలీసు అధికారి శుక్రవారం వెల్లడించారు. ఇటానగర్ పోలీస్ సూపరింటెండెంట్ రోహిత్ రాజ్‌బీర్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. మైనర్‌లను పొరుగున ఉన్న అస్సాంలోని ధేమాజీకి చెందిన ఇద్దరు సోదరీమణులు ఇక్కడకు రవాణా చేశారని చెప్పారు. అక్కాచెల్లెళ్లిద్దరూ ఇటానగర్‌లో బ్యూటీ పార్లర్ నడుపుతున్నట్లు చెప్పాడు. ఇక్కడికి సమీపంలోని చింపులో మైనర్ బాలికల వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసు బృందం మే 4న టెక్కీ రీనా, జామ్లో తగుంగ్‌ల ఇంటిపై దాడి చేసి ఇద్దరు మైనర్ బాలికలను రక్షించినట్లు ఆయన తెలిపారు.
Read Also: ISRO: 3డీ-ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో
అధికారి ప్రకారం, ఇద్దరు మహిళలు తమ ఇంటి నుంచి వ్యభిచారం నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పుష్పాంజలి మిలి, పూర్ణిమ మిలి అనే ఇద్దరు సోదరీమణులు తమను ధేమాజీ నుంచి ఇటానగర్‌కు తీసుకువచ్చారని విచారణలో మైనర్ బాలికలు చెప్పారని అధికారి తెలిపారు. ఇటానగర్‌కు అక్రమంగా తరలించిన తర్వాత తమను బలవంతంగా వ్యభిచారంలోకి దింపారని చెప్పారు.
ఇటానగర్ ఎస్పీ రోహిత్ రాజ్‌బీర్ సింగ్ మాట్లాడుతూ.. “ఈ విషయం గురించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తెలియజేయబడింది. వారి ఫిర్యాదు ఆధారంగా, ఇటానగర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. దీనితో పాటు ధేమాజీ నుంచి బాలికలను తీసుకువచ్చారని కూడా తేలింది. మరో ఇద్దరు మైనర్ బాలికలను కూడా రక్షించాం. పుష్పాంజలి మిలి అదుపులో ఉన్నారు. నలుగురు మహిళలను అరెస్టు చేశాం. మైనర్ బాలికలు షెల్టర్ హోమ్‌లో ఉన్నారు.” అని ఎస్పీ వెల్లడించారు. ముఠాలో ప్రమేయం ఉన్న కనీసం ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారని.. మిగిలిన ఎనిమిది మంది కస్టమర్లు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఎనిమిది మందిలో ముగ్గురు ప్రభుత్వ అధికారులు ఉన్నారని ఎస్పీ తెలిపారు.