Infosys: ఐటీ కంపెనీలకు సంబంధించి ఇటీవల మూన్ లైటింగ్ హాట్‌టాపిక్‌గా మారింది. మూన్ లైటింగ్ అంటే ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఆ కంపెనీకి తెలియకుండా మరో కంపెనీలో కూడా పనిచేస్తుండటం. మూన్ లైటింగ్ వ్యవహారంపై ఇటీవల టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు సీరియస్ అయ్యాయి. నిబంధనలను ఉల్లంఘించిన పలువురు ఉద్యోగులను తొలగిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశాయి. తాజాగా ఇన్ఫోసిస్ కంపెనీ తన ఉద్యోగులకు ఓ ఆఫర్ ఇచ్చింది. తమ ఉద్యోగులు కావాలనుకుంటే గిగ్ జాబ్స్ చేసుకోవచ్చని.. అయితే కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుందని పలువురికి మెయిల్స్ చేసింది. ఇన్ఫోసిస్ జాబ్ టైమింగ్స్‌లో కాకుండా మిగతా సమయాల్లోనే గిగ్ జాబ్స్ చేసుకునేందుకు అనుమతి ఇస్తామని కంపెనీ హెచ్ఆర్ వర్గాలు స్పష్టం చేశాయి.
Read Also: Shiv Nadar: దాతృత్వంలో తగ్గేదేలే.. రోజుకు రూ.3కోట్లు ఇచ్చేస్తున్న నాడార్
అయితే ఇన్ఫోసిస్ ఇతర బ్రాంచీలు లేదా తమ క్లయింట్ పోటీ సంస్థల వద్ద గిగ్ జాబ్స్ చేయకూడదని షరతు విధించింది. గిగ్ జాబ్స్ కారణంగా ఇన్ఫోసిస్‌లో ప్రధాన విధులపై ఎలాంటి ప్రభావం పడకూడదని కంపెనీ వర్గాలు తెలియజేశాయి. కాగా ఇన్ఫోసిస్ మెయిల్స్ వచ్చిన పలువురు ఉద్యోగులు గిగ్ జాబ్స్ అంటే తెలియక తలలు పట్టుకుంటున్నారు. గిగ్ జాబ్స్‌లో ఎలాంటి ఉద్యోగాలు వస్తాయో మెయిల్‌లో ఇవ్వకపోవడంతో తమకు అర్ధం కాక ఉద్యోగులు సతమతం అవుతున్నారు. ప్రధాన ఉద్యోగంతో పాటు చేసే పార్ట్ టైమ్ జాబ్, జాబ్ కాంట్రాక్ట్ లేదా ఆసక్తి ఉన్న రంగంలో చేసే చిన్న ఉద్యోగాలను గిగ్ జాబ్స్ అంటారని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఈ కేటగిరీలోకి పార్ట్ టైమ్ డ్రైవింగ్, పెయింటింగ్, కోచింగ్, ట్యూటరింగ్, ఫిట్ నెస్ ట్రైనింగ్, ఫ్రీలాన్స్ వర్క్ వంటి జాబ్స్ వస్తాయని తెలిపారు. దీంతో ఇన్ఫోసిస్ ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం ఇలాంటి గిగ్ జాబ్స్‌పై లుక్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.