అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారతీయ విద్యార్థి మృతిచెందాడు. భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య మృతి చెందినట్లు మంగళవారం విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్స్ తాత్కాలిక విభాగాధిపతి క్రిస్ క్లిఫ్టన్ తెలిపారు. అతడి మృతదేహాన్ని క్యాంపస్‌లోని ఓ భవనం వద్ద గుర్తించామని పేర్కొన్నారు. కాలేజ్ మ్యాగజైన్ ‘ది ఎక్స్‌పోనెంట్’లోనూ ఈ ఘటనకు సంబంధించిన వార్తను ప్రచురించారు. నీల్ ఆచార్య మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఆదివారం 12:30 నుంచి తన కుమారుడు కనిపించడం లేదని నీల్ ఆచార్య తల్లి గౌరీ ఆచార్య సోమవారం ఉదయం ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘మా అబ్బాయి నీల్ ఆచార్య జనవరి 28 నుండి కనిపించడం లేదు. అతడు అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతన్ని చివరిసారిగా ఉబర్ డ్రైవర్ పర్డ్యూ యూనివర్సిటీలో డ్రాప్ చేశాడు. మేము నీల్ ఆచార్య కోసం వెతుకుతున్నాము. అతడి గురించి మీకు ఏదైనా సమాచారం తెలిస్తే మాకు సహాయం చేయండి’ అని గౌరీ ఆచార్య పోస్ట్ చేశారు.
Also Read: Phone Unlock: ఫింగర్, ఐరిస్ మాత్రమే కాదు.. శ్వాసతో కూడా ఫోన్ అన్‌లాక్!
గౌరీ ఆచార్య పోస్ట్‌పై షికాగోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. పర్డ్యూ విశ్వవిద్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కావాల్సిన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ఇంతలోనే నీల్ ఆచార్య మృతి చెందినట్లు పర్డ్యూ విశ్వవిద్యాలయం ప్రకటించింది. నీల్ ఎలా మరణించాడనే దానిపై టిప్పెకోనో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.