సార్వత్రిక ఎన్నికల ముందు రైల్వేశాఖ ప్రయాణికులకు (Indian Railways) శుభవార్త చెప్పింది. ఛార్జీల విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్ రైళ్లలో (Passenger Train) తిరిగి పాత ఛార్జీలనే వసూలు చేయాలని రైల్వేశాఖ ఆదేశించింది. దీంతో ప్రయాణికులకు పెద్ద ఉపశమనం లభించింది. ఫిబ్రవరి 27 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.
కోవిడ్-19 తర్వాత మెము/డెము ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ స్పెషల్స్‌గా మార్చి సెకండ్ క్లాస్ ఛార్జీలను వసూలు చేసింది. దీంతో పేద ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేగం ఏమైనా పెరిగిందా? అంటే.. అది లేదు. ఛార్జీలు పెంచారే తప్ప.. వేగం పెరగలేదు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి ఎన్నికల ముందు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19కు ముందు ఉన్న ఛార్జీలనే ఫిబ్రవరి 27 నుంచి వసూలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
కోవిడ్‌కు ముందు ఇలా..
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తికి ముందు చెన్నై నుంచి తిరుపతికి ప్యాసింజర్ లేదా DEMU రైలులో ప్రయాణించడానికి రూ.35 ఉండేది. కానీ COVID లాక్‌డౌన్ తర్వాత.. అదే ఛార్జీ రూ.70కి పెరిగింది. అదే విధంగా చెన్నై బీచ్ నుంచి వెల్లూరు, చెన్నై ఎగ్మోర్ నుంచి పుదుచ్చేరికి రూ. 30 లేదా రూ. 45 ఉన్న టిక్కెట్ ధర వరుసగా రూ. 65 మరియు రూ.80కు పెరిగింది. ఇప్పుడు తాజాగా రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయంతో పాత ఛార్జీలే అమల్లోకి వచ్చాయి.